
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి’ విషయంలో అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ సినిమాగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఫైట్స్ అన్నీ భారీ ఎత్తున తలపెట్టి విజువల్ వండర్‌గా సినిమాను తయారుచేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మే 15న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక గురించి ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. సాధారణంగానే రాజమౌళి సినిమా ఆడియో లాంచ్ అంటే కొత్తదనం ఆశించవచ్చు. బాహుబలికీ అదే తరహాలో సరికొత్తగా ఆడియో లాంచ్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవనున్న ఈ సినిమా ఆడియోను మూడు వేదికలపై మూడు భాషలకు వేర్వేరుగా నిర్వహిస్తారనే టాక్ వినబడుతోంది. అయితే హైద్రాబాద్‌లోనే ఒకే వేదికపై హిందీ, తెలుగు, తమిళ స్టార్లందరి సమక్షంలో ఒకేసారి నిర్వాహించాలన్న ఆలోచనా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఊహగానాల పట్ల ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించబడుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెలాఖర్లోనే ఆడియో ఆవిష్కరణను చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

