
ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా పరిశ్రమలోని వారికి సేవ చేయడం కోసం ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) అధ్యక్ష పదవికోసం పోటీ చేసి గెలిచాడు. మా అధ్యక్షుడిగా ఎన్నికవ్వగానే పలువురికి సహాయ సహకారాలు కూడా అందించాడు. ఈ రోజు ఉదయం మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, అతని కార్యవర్గ సభ్యులు శివాజీరాజా, కాదంబరి కిరణ్ లు శ్రీ వెంకటేశ్వరా స్వామిని దర్శించుకొని తమ మొక్కును
తీర్చుకున్నారు.
ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో దర్శనం చేసుకున్న వారికి అక్కడి పూజరులు ప్రసాదం కూడా అందించారు. బయటకి వచ్చిన రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ‘ మంచి కోసం, మార్పు కోసం అని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆయన్ని నమ్ముకొని మా ఎన్నికల్లోపోటీ చేశాను, గెలిచాను. అందుకే అందరం వచ్చి ఆయన్ని దర్శించుకున్నాము. తితిదే బోర్డు మెంబర్స్ లో మా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి అవకాశం కల్పించినందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యం మంత్రి నారా చంద్రబాబునాయుడుకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని’ అన్నాడు.

