‘బాహుబలి’.. ఓ ఊహకందని మాయ!

‘బాహుబలి’.. ఓ ఊహకందని మాయ!

Published on Jul 1, 2015 3:57 PM IST

srinivas
దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులంతా ‘బాహుబలి’ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బాహుబలి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన వి.శ్రీనివాస్ మోహన్ ఓ ప్రముఖ పత్రికతో బాహుబలి విశేషాలను పంచుకున్నారు.

బాహుబలి సినిమా గురించి రాజమౌళి చెప్పినపుడు కొన్ని రోజులు నిద్ర పట్టలేదనీ, ఇలాంటి సినిమాకు తాను విజువల్ ఎఫెక్ట్స్ అందించగలనా అని భయపడేవాడినని శ్రీనివాస్ అన్నారు. అయితే రాజమౌళి తనను అంతగా నమ్మాక ఆ భయం మొత్తం పోయిందని ఆయన తెలిపారు. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో, భారత దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఊహక్కూడా అందనట్లుగా ఉంటాయని ఆయన అన్నారు. ‘బాహుబలి’ అంటే ఊహకందని ఓ అద్భుతమైన మాయ అని శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు.గతంలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సంచలనం సృష్టించిన ‘రోబో’ సినిమాతో పాటు శంకర్ తెరకెక్కించిన ‘ఐ’, ‘శివాజీ’ సినిమాలకు శ్రీనివాస్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు.

ఇక ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు