
కమల్ హాసన్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా ‘పాపనశం’. తమిళనాట భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మళయాలంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాకు రీమేకే ఈ పాపనశం. ఇదే ‘దృశ్యం’ సినిమాను వెంకటేష్ తెలుగులో అదే పేరుతోనే రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే! మళయాల ‘దృశ్యం’ను తెరకెక్కించిన జీతూయే తమిళ రీమేక్‌నూ తెరకెక్కించారు.
ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోరాడడం నేపథ్యంలో తెరకెక్కిన ‘పాపనశం’ తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మొదటి వారాంతం మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. బలమైన కథ కావడం, అలాంటి కథకు కమల్ హాసన్ లాంటి స్టార్ నటుడు తోడవ్వడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు మొదటి వీకెండ్ ఈ సినిమా సుమారు 25కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

