‘బ్రూస్ లీ’తో బాస్ ఈజ్ బ్యాక్..!

‘బ్రూస్ లీ’తో బాస్ ఈజ్ బ్యాక్..!

Published on Oct 15, 2015 7:05 PM IST

bruce-lee
దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతూ వచ్చిన చిరంజీవి, చాలాకాలం గ్యాప్‌ తర్వాత మళ్ళీ ‘బ్రూస్ లీ’ సినిమాతో తెరపై దర్శనమివ్వనున్న విషయం తెలిసిందే. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందిన ‘బ్రూస్ లీ’ సినిమా ఈ సీజన్‌లో భారీ అంచనాల మధ్య వస్తోన్న అతిపెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. చిరు ఓ గెస్ట్ రోల్ చేయనున్నారన్న ఒక ప్రధాన అంశం ఈ సినిమాపై అప్పటికే విపరీతంగా ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో కొన్ని గంటల్లో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో వాలిపోనుంది.

ఇక ‘బ్రూస్ లీ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి షో హైద్రాబాద్‌లో అంధుల కోసం ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 గంటలకు ఈ ప్రీమియర్ షో ప్రదర్శితం కానుంది. ఇక అర్థరాత్రి 1 గంటకు బ్రూస్ లీ ఫ్యాన్స్ షో ప్రదర్శితం కానుంది. అంతటా చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ గురించే భారీగా అంచనాలు బయలుదేరాయి. ఇక గత కొద్దిసేపటి క్రితం సినిమా యూనిట్ బ్రూస్ లీలో చిరంజీవి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చూసిన అభిమానులంతా నిజంగానే బాస్ ఈజ్ బ్యాక్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫస్ట్‌లుక్‌తోనే ఈ స్థాయి రెస్పాన్స్ వస్తే ఇక మరికొద్ది గంటల్లో చిరు తెరపై కనిపించి ఇంకెంత ట్రెండ్ సృష్టిస్తారో వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు