
క్రిష్.. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఇలా తీసిన ప్రతి సినిమాలోనూ తనదైన బలమైన భావోద్వేగాన్ని ప్రెజెంట్ చేస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తాజాగా ‘కంచె’ అనే మరో సరికొత్త ప్రయత్నంతో మనముందుకు వస్తోన్న క్రిష్, ఈ సినిమాలో మనం ఇప్పటివరకూ చూడనటువంటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే మన కథను చెబుతున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా పెద్ద ఎత్తున కంచె సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా క్రిష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘కంచె’.. ఇప్పటివరకూ దీపావళికి ఫిక్స్ అయి మళ్ళీ అనూహ్యంగా దసరా రిలీజ్‌కు సిద్ధమయ్యారు?
స) (నవ్వుతూ) నిజంగానే అంతా అనుకోకుండా జరిగిపోయింది. మొదట అక్టోబర్ 2వ తేదీకి ఫిక్స్ అయ్యాం. అప్పటికి మరికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉండడంతో నవంబర్‌కి వెళ్ళాం. ఇక నిన్న అనుకోకుండా దసరా వారం స్లాట్ ఖాళీ అయిపోవడంతో అప్పటికప్పుడు సడెన్ డిసిషన్ తీసుకున్నాం. ఏదేమైనా విజయ దశమికి వస్తున్నాం. ఆ ఆలోచనే విజయాన్ని స్ఫురిస్తోంది. అంతకన్నా కావాల్సిందేముంది?
ప్రశ్న) ‘కంచె’తో ఇప్పటివరకూ తెలుగులో రానటువంటి ఓ సరికొత్త జానర్ సినిమాతో వస్తున్నారు. ఈ కథను మీ ప్రయాణంలో కావాలనే ఎంచుకున్నారా?
స) కథలను కావాలని ఎంచుకోవడమంటూ జరగదండీ. అవే మనదగ్గరకు వచ్చి పడుతుంటాయి. ‘వేదం’ సమయంలో వైజాగ్ దగ్గర ఒక మ్యూజియం వద్ద రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికీ, మనకూ ఉన్న సంబంధం గురించి తెలిసింది. ఆ తర్వాత 25 లక్షల మంది భారత సైనికులు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారని తెలిసింది. నాకు వాళ్ళ జీవితాలన్నీ కథల్లాగే కనిపించాయి. ఈ నేపథ్యానికి, ఓ ప్రేమకథకు జతకట్టి చేసిన ప్రయత్నమే ఈ ‘కంచె’.
ప్రశ్న) ‘కంచె’ సినిమా ద్వారా మీరు బలంగా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి?
స) ఈ సినిమాలో ‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది’ అని ఒక డైలాగ్ ఉంది. ఈ సినిమాలో ప్రధానంగా ఈ అంశాన్ని చెబుతున్నా. అదేవిధంగా ఈ అంశం చుట్టూనే చాలారకాలైన భావేద్వేగాలున్నాయి. అవన్నీ కథతో పాటు సమాంతరంగా నడిచే విషయాలుగా చెప్పుకోవచ్చు.
ప్రశ్న) యుద్ధం నేపథ్యంలో మనకు చాలా తక్కువ సినిమాలే వచ్చాయి. ఇది మీరు కొత్తగా చేయడం రిస్క్ అనిపించలేదా?
స) మనం ఈ జానర్లో ఇప్పటివరకూ సినిమాలు తీయకపోవడమనేది నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోన్న విషయం. మనచుట్టూ ఇన్ని కథలున్నా వాటిని మనం చూడలేకపోయామే అనిపించింది. నాకు ఇలాంటి ఒక కథ, నేపథ్యం పరిచయమవ్వడం, దాంతో ఒక సినిమా తీయాలని అనిపించడం.. నా అదృష్టమేమో! ఇక రిస్క్ అంటారా.. మనం నమ్మిన కథను వీలైనంత జెన్యూన్‌గా చెప్పడమే మన ప్రధాన లక్ష్యం. దాన్నే నేను బలంగా నమ్ముతా.
ప్రశ్న) రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమా ‘కంచె’. ఆ మూడ్‌ని తీసుకురావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
స) చాలా జాగ్రత్తలు తీసుకున్నామండీ. ఒక్క మూడ్, బ్యాక్‌డ్రాప్ విషయంలోనే కాక సినిమా కథకు సంబంధించి కూడా మొదట్నుంచే చాలా పరిశోధన చేశాం. మీరు సినిమా చూస్తే.. ఇందులో కథ రీత్యా వాడిన ఆయుధాలు, యుద్ధ సామాగ్రి.. అన్నీ రెండో ప్రపంచ యుద్ధంలో వాడినవే తెచ్చిపెట్టాం. కంచె టీమ్ మొత్తం కలిస్తేనే ఇప్పుడు ఈ ఔట్‌పుట్ వచ్చింది.
ప్రశ్న) హీరో వరుణ్ తేజ్ గురించి చెప్పండి?
స) వరుణ్ తేజ్ ఈ సినిమాకు ఫస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్. సినిమా చూశాక వరుణ్ తప్ప మరొకరు ఈ పాత్రకు సరిపోరేమో అనిపిస్తుంది. ప్రతీ చిన్న విషయంలో, ప్రతీ చిన్న సన్నివేశంలో వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తీసుకున్న జాగ్రత్త అతడికి ఓ ప్రత్యేకత తెచ్చిపెడుతుందని చెప్పగలను. ఈ సినిమా తర్వాత వరుణ్ ఒకేసారి గ్రేట్ స్టార్ – గ్రేట్ యాక్టర్ అనిపించుకుంటాడు.
ప్రశ్న) ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారు?
స) కమర్షియల్ సినిమా అంటే ఇక్కడ వేరే అర్థాలున్నాయి. నన్నడిగితే ఆ తరహా కమర్షియల్ సినిమాలకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడు ఏ సినిమాకైనా కంటెంట్ అనేదే ముఖ్యం. ఈ సినిమాలో బలమైన కంటెంట్ ఉంది. అంతేకాకుండా అందరూ కనెక్ట్ కాగలిగేంత ఎమోషన్ ఉంది. ఈ సినిమాకు కథే పెద్ద స్టార్!
ప్రశ్న) ట్రైలర్ తర్వాత సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇతర భాషల్లోనూ సినిమా రిలీజ్ చేయనున్నారని తెలిసింది. అదెప్పుడు ప్లాన్ చేస్తున్నారు?
స) ఈ కథకు యూనివర్సల్ అప్పీల్ ఉంది. అందుకే ఇతర భాషల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం సినిమా కేవలం తెలుగులోనూ విడుదలవుతోంది. యా! ఇతర భాషల నుంచి ఈ సినిమాకు ఈ స్థాయి ఆఫర్లు వస్తున్నాయంటే అది ట్రైలర్ వల్లే! ట్రైలర్ చూడగానే నాకు మహేష్ గారు మెసేజ్ చేశారు. ఆయన నాతో ఎప్పుడూ రియాక్ట్ అవుతూ ఉంటారు. చరణ్, బన్నీ, ఎన్టీఆర్.. ఇలా అందరూ సినిమా గురించి మాట్లాడ్డం నాకైతే చాలా ఎనర్జీనిచ్చింది.
ప్రశ్న) ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’.. ఇలా ప్రతీ సినిమా ద్వారా ‘క్రిష్ సినిమా అంటే ఇదీ’ అనే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సినిమాలే తీయడానికి కారణం?
స) ఇలాంటి సినిమాలే తీయడానికి కారణం అంటే.. నాకు ఆ పరిస్థితుల్లో ఆ కథలు కనిపించాయి, ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది. సినిమాలు తీశా. ఒక సినిమాను ప్లాన్ చేసుకొని కథ రాయడమంటే నాకైతే కుదరదు. ఆ కథే వచ్చి మనల్ని తడుతుంది. మన చుట్టూనే చాలా కథలున్నాయి. అవే వచ్చి నన్ను పలకరిస్తున్నాయంతే!
ప్రశ్న) ‘కంచె’ తరువాత ఏ సినిమా చేయబోతున్నారు?
స) ముందు ఈ సినిమాను విడుదల కానివ్వండి! మేం అనుకున్న సమయానికంటే చాలా ముందే థియేటర్ల ముందుకు వస్తున్నాం. ఇప్పుడు దృష్టంతా కంచెపైనే! ఆ తర్వాతే తదుపరి సినిమా ఏంటనేది తెలియజేస్తా.

