మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా రెండు రోజుల క్రితం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. అంతే కాకుండా ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత మెగస్టార్ చిరంజీవి మళ్ళీ ఓ 4 నిమిషాల పాటు తెరపై కనిపించి అభిమానులను ఎంటర్టైన్ చేసాడు. చిరు చేసిన రోల్ మరియు సినిమాకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న రామ్ చరణ్ ని తన సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కి ఆహ్వానించి చరణ్ ని అభినందించాడు. ఈ కలయిక అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
నిన్న అది అయ్యిందో లేదో ఈ రోజు మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేలా మరో సంఘటన చోటు చేసుకుంది. అదే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరుని కలవడం. కొద్ది సేపటి క్రితం పవన్ కళ్యాణ్ చిరు స్వగృహంలో ఆయన్ని కలిసి బ్రూస్ లీ సినిమాలో చిరు నటించినందుకు, ఆ పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు గాను అభినందనలు తెలిపాడు. ‘చాలా గ్యాప్ తర్వాత అన్నయ్య మళ్ళీ తెరమీద కనిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య 150వ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సర్దార్ గుజరాత్ షూటింగ్ కి వెళ్ళేలోపు బ్రూస్ లీ సినిమా చూస్తాను. రాజకీయ పరంగా మా ఆలోచనలు వేరైనప్పటికీ, సినిమాలు, కుటుంబం అనే విషయాలు వచ్చినప్పుడు మాత్రం అన్నయ్యని నేను చాలా గౌరవిస్తానని’ పవన్ కళ్యాణ్ మీడియాకి తెలిపాడు.


