
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి రెండు ప్రత్యేకత సంతరించుకున్న సినిమాలతో దూసుకుపోతోన్న తెలుగు సినిమాకు మరో ప్రత్యేకత చేకూర్చేందుకు వస్తోన్న సినిమాయే ‘కంచె’. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఇండియన్ సినిమాలో వస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకుడికి ఓ సరికొత్త అనుభూతినిస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.
ముకుందా సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకోనున్నారు. దర్శకుడు క్రిష్ వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ అద్భుతమైన నటుడని, కంచె సినిమాలోని ధూపాటి హరిబాబు పాత్రకు వరుణ్ తప్ప మరొకరు సెట్ కారని అన్నారు. మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించిన వరుణ్, ఈ సినిమాతో ఒకేసారి స్టార్ కమ్ సూపర్ యాక్టర్ అనిపించుకుంటారని కంచె టీమ్ చెబుతోంది.
దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉండడంతో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాతో వరుణ్ మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్‌గా అవతరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు.

