
హీరోగా పలు అద్భుతమైన కామెడీ సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన నటుడు నరేష్, ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే స్థాయిలో మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో తనకు సూటయ్యే పాత్రలు ఇప్పుడిప్పుడే వరుసగా వస్తున్నాయని, ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్తోన్న పాత్రలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయని తెలుపుతూ నరేష్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు.. మీ కోసం..
ప్రశ్న) తెలుగులో మళ్ళీ మీ మార్క్ చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నట్టున్నారు? సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది?
స) సెకండ్ ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా ఉందండీ. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక ఏయే పాత్రలకు నేను సెట్ అవుతానా అనేది ఇండస్ట్రీకి కూడా కొత్తగానే ఉండేది. ప్రస్తుతం దర్శకులంతా సరికొత్త పాత్రలతో ముందుకు వస్తున్నారు. దీంతో నాకంటూ ఒక ప్రత్యేక పంథా తయారైంది. ఆ పంథాలో వినూత్న పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ మరింత ఉత్సాహాన్నిస్తోంది. ముఖ్యంగా ‘చందమామ కథలు’, ‘దృశ్యం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘భలే భలే మగాడివోయ్’ లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భలే భలే మగాడివోయ్ సినిమాను నా సెకండ్ ఇన్నింగ్స్‌లో సిక్సర్‌గా చెబుతా!
ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు ఒప్పుకున్నారు?
స) కామెడీ, సీరియస్.. ఇలా విభిన్న తరహా షేడ్స్ ఉన్న పాత్రలు పలకరిస్తున్నాయి. మహేష్ హీరోగా రూపొందుతోన్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నా. ఈ సినిమా కోసం 40 రోజుల డేట్స్ కేటాయించా. సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఇక నాకిష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ‘అ..ఆ..’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నా. ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన గుంటూర్ టాకీస్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇలా వరుసగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నా.
ప్రశ్న) చిన్న సినిమా, పెద్ద సినిమా.. ఏ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు?
స)చిన్న సినిమా, పెద్ద సినిమా అని గిరి గీసుకొని సినిమాలు ఎంచుకునే ఆలోచన లేదు. నేను చేసే పాత్ర ద్వారా సినిమాకు ఎంత ఉపయోగం ఉంటుందన్నదే మేజర్ అజెండా. ఆ ప్రకారంగానే సినిమాలను ఎంపిక చేసుకుంటూ వెళుతున్నా.
ప్రశ్న) శృతిలయ ఆర్ట్స్ అకాడమీ అందించిన ‘నవరస రాయ’ బిరుదుపై మీరేమంటారు?
స) నా మూడు దశాబ్దాల కెరీర్లో ఇలాంటి బిరుదులు ఎప్పుడూ తీసుకోలేదు. శృతిలయ వారు ‘మీకు ఒక గుర్తింపునిచ్చేలా నవరస రాయ అనే బిరుదునిస్తున్నాం’ అని చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయా. అయితే ఏ కళాకారుడైనా ఎప్పుడూ కోరుకునేది చిన్న గుర్తింపు, ప్రశంస మాత్రమే! ఈ బిరుదుకు నేను ఎంతవరకు న్యాయం చేశాననేది పక్కనబెడితే ఇలాంటి గుర్తింపులతో ఏ కళాకారుడికైనా కొత్త ఉత్సాహం వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బిరుదును నిలబెట్టుకునే పాత్రలు చేయడమే ముందున్న లక్ష్యం!
ప్రశ్న) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కీలక పదవిలో ఉన్నారు. ఈ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారు?
స) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో చరిత్రాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం ఈ అసోసియేషన్‌కు సంబంధించిన సరైన డేటా బేస్ ఏదీ లేదు. అందుకే వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సర్వే చేపట్టాం. ఈ సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. దీంతో మొత్తం ‘మా’ సభ్యులకు సంబంధించి ఒక డేటా బేస్ సిద్ధం చేస్తాం. ఈ డేటా బేస్‌తో ఎవరికి ఏ తరహా ఇబ్బందులు వచ్చినా వెంటనే తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈమధ్యే కొందరికి మా తరపున సరైన సమయంలో సహాయం అందజేయలేదన్న విషయం చర్చకు వచ్చింది. ఇకపై అలా జరగకుండా చూస్తున్నాం.

