చిట్‍చాట్ : హెబ్బా పటేల్ – ‘కుమారి..’ కొంచెం బోల్డ్..!

చిట్‍చాట్ : హెబ్బా పటేల్ – ‘కుమారి..’ కొంచెం బోల్డ్..!

Published on Nov 15, 2015 6:41 PM IST

Hebha-Patel
‘కుమారి 21 ఎఫ్’.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌ యూత్‌ఫుల్ క్రేజీ సినిమాగా విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్‌తో జరిపిన చిట్‌చాట్ విశేషాలు…

ప్రశ్న) ‘కుమారి 21 ఎఫ్’.. టైటిల్ రోల్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?

స) హీరో, హీరోయిన్.. ఇలా ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యమున్న సినిమాలో హీరోయిన్ పేరుతో టైటిల్ ఉండడం, అందులో నేను హీరోయిన్‌గా నటించానంటే చాలా సంతోషంగా ఉంది. అదీకాకుండా టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఇలాంటి క్రేజున్న సినిమాలో నేనూ ఒక భాగమవ్వడం నా అదృష్టం.

ప్రశ్న) ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ బ్యానర్‌లో సినిమా అనగానే ఎలా ఫీలయ్యారు?

స) గతంలో నేను చేసిన ‘అలా ఎలా?’ సినిమా చూసి దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ సినిమా కోసం ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఫస్ట్ రీజన్ ఎవరూ అనడిగితే.. సుకుమార్ గారి పేరు చెబుతా. సుకుమార్ సినిమాలో అవకాశమంటే ఎవరు కాదంటారు చెప్పండి? ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు. ఆయన ఈ సినిమాకు పనిచేస్తున్నారంటే ఇంకో మాట ఆలోచించలేదు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది. కుమారి బోల్డ్ అని వినిపిస్తోంది. ఎంతవరకు నిజం?

స) కుమారి.. ఈతరం అమ్మాయి. ఈతరం ఆలోచనలు, ప్రేమలను నమ్మే యువతి. కచ్చితంగా కుమారి ఆలోచనలు కొంత బోల్డ్‌గానే ఉంటాయి. కాకపోతే ఆ బోల్డ్‌నెస్ మంచిదా? చెడ్డదా? ఆ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుంది? చివరికి ఏం చెప్తుందీ ఇవన్నీ సినిమాలోనే చూడాలి.

ప్రశ్న) హీరో రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

స) రాజ్ తరుణ్ ఇప్పటికే రెండు హిట్ సినిమాల హీరో! ఈ సినిమా ప్రారంభయ్యాకే అతడి సినిమాలను చూశా. సెట్లో చాలా సరదాగా ఉంటూ, యాక్టింగ్‌లో ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇస్తూంటాడు. సినిమాలో మా కెమిస్ట్రీ కూడా చాలా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్ దగ్గర్నుంచి ఏమేం నేర్చుకున్నారు?

స) నిజంగానే ఇది నా అదృష్టమనే చెప్పాలి. ఇంతమంది టాప్ టెక్నీషియన్స్‌తో సినిమా అంటే నేర్చుకోవడనికి ఎంతో ఉంటుంది. యాక్టింగ్ పరంగా ఈ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాగే కెమెరాను ఫేస్ చేయడం, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ పలకడంలో కొంత పరిణతి వచ్చింది.

ప్రశ్న) ‘కుమారి 21 ఎఫ్‌’పై మీ అంచనాలు ఎలా ఉన్నాయ్? దీని తర్వాత ఏయే సినిమాలు చేస్తున్నారు?

స) కుమారి 21 ఎఫ్ కచితంగా ఈతరం యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యే సినిమా. ప్రతీ ప్రేమ జంటా తమను తాము ఈ సినిమాలో చూసుకుంటారని కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా నా కెరీర్‌కు కూడా మంచి బూస్ట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది. ఇక ప్రస్తుతానికి నా ఆలోచనలన్నీ కుమారి 21 ఎఫ్ కే పరిమితం. త్వరలోనే కొత్త సినిమా ఏంటనేది ప్రకటిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు