
తెలుగులో హాస్యకథా సినిమాలను ఇష్టపడే వారికి 1980, 90ల దశకంలో స్టార్ దర్శకుడుగా పేరుగాంచిన వంశీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘లేడీస్ టైలర్’ లాంటి కథా బలమున్న కామెడీ సినిమాలు దర్శకుడిగా ఆయన స్థాయిని చెప్పే సినిమాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఆయన తన సినిమాల్లో సున్నితమైన కథనం, హాస్యంతో పాటు సంగీతానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారన్న విషయం తెలిసిందే.
ఆ కోవలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాతో పలు అద్భుతమైన మ్యూజికల్ వండర్స్ అందించిన వంశీ, ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రితోనూ అదే స్థాయి మ్యూజికల్ సెన్సేషన్స్‌తో మెప్పించారు. కాగా చక్రి మరణం తర్వాత ఇంతవరకూ సినిమా చేయని వంశీ, తన కొత్త సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మతో జతకట్టారు. వంశీ ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్ పేరుతో హీరో రాజ్ తరుణ్‌తో ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. ఇక మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇళయరాజా, చక్రిలతో అద్భుతంగా సాగిన వంశీ పాటల ప్రయాణం మణిశర్మ కాంబినేషన్లో ఎలా ఉంటుందన్నది చూడాలి.

