మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనున్న ఈ చిత్రం గురించిన పలు రూమర్లు ఇప్పటికే హడావుడి చేయగా ఇప్పుడు మరొక కొత్త వార్త అభిమానుల్ని కొంత గందరగోళానికి గురిచేసింది.
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ లాగానే ఈ చిత్రంలో కీలక పాత్ర చేయాల్సిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తప్పుకున్నారనేది ఆ వార్త. దీనిపై స్పందించిన చిత్ర సన్నిహిత వర్గాలు అలాంటిదేం లేదని, అమితాబ్ ఈ సినిమాలో నటిస్తున్నారని, త్వరలోనే ఆయన షూటింగ్లో జాయిన్ అవుతారని స్పష్టం చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.


