దివంగత నటుడు చిరంజీవి సర్జా కుటుంబానికి మరొక కష్టం వచ్చి పడింది. ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. ఆయన సతీమణి మేఘనా రాజ్ ఆమె నెలల బిడ్డ, ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతిని మేఘనా రాజ్ స్వయంగా బయటపెట్టారు. అయితే ఈ కష్టాన్ని చూసి ఆమె ఏమాత్రం భయపడట్లేదు. తప్పకుండా కరోనాను జయిస్తామని ధీమాగా చెప్పారు. ‘హలో ఆల్.. నాన్న, అమ్మ, నేను, నా కొడుకు కొవిడ్ బారినపడ్డాం. ఇటీవల మమ్మల్ని కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. అభిమానులు ఎవరూ కంగారుపడక్కర్లేదు. మేమందరం బాగానే ఉన్నాం. చికిత్స తీసుకుంటున్నాం. నా కుమారుడు బాగానే ఉన్నాడు’ అన్నారు.
ఈ సంగతి తెలియడంతో చిరంజీవి సర్జా అభిమానులు కొంత ఆందోళనపడినా మేఘన రాజ్ చూపుతున్న ధైర్యానికి మెచ్చుకుంటూ వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మేఘనా రాజ్, చిరంజీవి సర్జా 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబం అంతా ఆనందంగా ఉన్న సమయంలో చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో మరణించారు. దీంతో మేఘనా రాజ్ సహా కుటుంబం మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిలోకి వెళ్లిపోయారు. చిరంజీవి సర్జా మరణించే సమయానికి మేఘనా రాజ్ గర్భవతి. దీంతో అభిమానులు మరింత ఆవేదనకు లోనయ్యారు.


