
విక్టరీ వెంకటేష్ వరుసగా భిన్నమైన సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ చేస్తున్న ఆయన ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలు సమాంతరంగా జరుగుతున్నాయి. ఇకపోతే వెంకీ చేయాల్సిన తర్వాతి జాబితాలో కూడ ఆసక్తికరమైన సినిమాలున్నాయి. వాటిలో ఒకటి తరుణ్ భాస్కర్ చిత్రం. వీరి చిత్రం గత ఏడాదిలోనే ఫైనల్ అయింది.
ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతొందని అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అసలు తాను వెంకటేష్ గారితో ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలని అనుకున్నానని, ఆయనకు కూడ మొదట ఆ కథే చెప్పి రెండవ కథగా స్పోర్ట్స్ డ్రామా చెప్పానని ఊహించని విధంగా ఆయనకు స్పోర్ట్స్ డ్రామా నచ్చి దాన్నే డెవలప్ చేయమని చెప్పారని, అందుకే అది చేస్తున్నామని చెప్పారు. మరి వెంకీకి అంతలా నచ్చిందంటే ఆ కథ ఎలా ఉంటుందో చూడాలి మరి.
సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుందిని వినికిడి. చాలా వరకు సినిమాను మలక్ పేట్ రేస్ క్లబ్బులో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

