మరింత లేటుగా ‘విశ్వంభర’.. మౌనం వీడని వశిష్ఠ..?

మరింత లేటుగా ‘విశ్వంభర’.. మౌనం వీడని వశిష్ఠ..?

Published on Sep 17, 2026 11:58 PM IST

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయమైంది. ఈ సినిమాను 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి పుకార్లకు తావులేకుండా అనుకున్న తేదీకే సినిమా వస్తుందని స్పష్టం చేస్తూ, త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

దీంతో కాకా రిలీజ్ ముమ్మాటికీ సంక్రాంతికే అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, చాలా కాలంగా ఆలస్యమవుతున్న చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి రేసులో ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకే సొంతం చేసుకుంది.

కానీ, ప్రస్తుతం కాకా రిలీజ్ డేట్‌ను మరోసారి కన్ఫర్మ్ చేయడంతో విశ్వంభర రిలీజ్ అయోమయంలో పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో ఎలాగైనా తీసుకురావాలని దర్శకుడు వశిష్ఠ అండ్ టీమ్ తీవ్రంగా ప్రయత్ని్స్తున్నారు. కానీ, ఇప్పుడు కాకా సంక్రాంతి సీజన్‌ను లాక్ చేయడంతో విశ్వంభర కోసం మరో కొత్త డేట్ వెతుక్కునే పనిలో దర్శకుడు వశిష్ఠ అండ్ టీమ్ పడ్డారు. మరి విశ్వంభర కొత్త రిలీజ్ డేట్‌పై వశిష్ఠ ఎప్పుడు మౌనం వీడుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు