‘చాయ్ వాలా’లోని సెన్సిబుల్ కథ అందరినీ మెప్పిస్తుంది – నిర్మాత వెంకట్

‘చాయ్ వాలా’లోని సెన్సిబుల్ కథ అందరినీ మెప్పిస్తుంది – నిర్మాత వెంకట్

Published on Aug 20, 2025 8:30 AM IST

Chai Wala

యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘చాయ్ వాలా’ టైటిల్‌ను నిర్మాత వెంకట్ గారే నిర్ణయించారు. అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. కథను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను చేశారు. థియేటర్లోనే వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్లేలా ఉండే చిత్రాలు హిట్ అవుతాయి. ‘చాయ్ వాలా’ చిత్రాన్ని చూసిన తరువాత ఎమోషన్‌తో బయటకు వెళ్తారు. రాజీవ్ కనకాల గారు గొప్ప యాక్టర్. ఇమ్రాన్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తేజు అశ్వినికి తెలుగులో చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ప్రమోద్ రాసిన మంచి కథకు, మంచి నటీనటులు కలిసి వచ్చారు. క్రాంతి గారు చక్కటి విజువల్స్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ‘చాయ్ వాలా’ చిత్రం ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది.’ అని అన్నారు.

శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘చాయ్ వాలా’ టీంతో నాకు మంచి బంధం ఏర్పడింది. ప్రమోద్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మా నిర్మాత ఈ కథను మాకంటే ఎక్కువగా నమ్మారు. రైటర్ ఇమ్రాన్, డీఓపీ క్రాంతి, ఆర్ట్ సుప్రియ ఇలా మంచి టీంతో ప్రమోద్ మూవీని తెరకెక్కించారు. థియేటర్ నుంచి ఓ మంచి ఎమోషన్‌తోనే బయటకు వస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నిర్మాత వెంకట్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ప్రతీ రోజూ సినిమా గురించి, సీన్ల గురించి చర్చించేవారు. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. రాజీవ్ కనకాల గారితో పని చేసిన క్షణాల్ని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. తేజుతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆమె చాలా మల్టీ టాలెంటెడ్. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.’ అని అన్నారు.

దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ.. ‘‘శివ గారికే ఈ కథను చెప్పాను. కథకు తగ్గట్టుగా ఫేస్‌లోనే ఓ సెన్సిబిలిటీ, ఓ జాలీ కనిపించాలి. అందుకే శివ గారికి ‘చాయ్ వాలా’ కథను చెప్పాను. నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్ వాలా’ టైటిల్‌ను తీసుకున్నాను. ప్రతీ మనిషి జీవితంలో జరిగే సంఘటనలే మా చిత్రంలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత వెంకట్ ఆర్. పాపుడిప్పు మాట్లాడుతూ .. ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అని అంటారు కానీ.. సినిమా చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈ మూవీలోని కొన్ని సీన్లను ఆల్రెడీ చూశాను. నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఇదొక సెన్సిబుల్ లవ్ స్టోరీ. అందరినీ ఆకట్టుకునేలా ఈ మూవీని తీశార’ని అన్నారు.

తేజు అశ్విని మాట్లాడుతూ .. ‘తెలుగులో నాకు ‘చాయ్ వాలా’ మొదటి చిత్రం. రాజీవ్ కనకాల వంటి సీనియర్ ఆర్టిస్ట్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. శివ గారు అద్భుతమైన కో ఆర్టిస్ట్. క్రాంతి గారు మా అందరినీ అందంగా చూపించారు. సెట్‌లో మా అందరినీ రాజ్ కందుకూరి గారు ఎంకరేజ్ చేస్తుండేవారు. ‘చాయ్ వాలా’ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు