నటభూషణ శోభన్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజున ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ రీ-రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోలో జరిగిన కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మురళీమోహన్ మాట్లాడుతూ.. “శోభన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు. నన్ను సినిమా రంగంలోకి ఆహ్వానించింది ఆయనే. మా బ్యానర్‌లో వచ్చిన ‘అతడు’ సినిమాలో ఓ పాత్ర కోసం బ్లాంక్ చెక్ ఇచ్చినా, తన ‘అందాల నటుడి’ ఇమేజ్ కోసం సున్నితంగా తిరస్కరించారు. ఆయన వెండితెరకు దూరమై 30 ఏళ్లు గడుస్తున్నా, అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు” అని కొనియాడారు.
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. 1975లో వచ్చిన ‘సోగ్గాడు’ తమ సంస్థకు మంచి లాభాలను, పేరును తెచ్చిపెట్టిందన్నారు. ఆధునిక సౌండ్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కైకాల నాగేశ్వరరావు, అట్లూరి పూర్ణచంద్రరావు, కె.ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.


