‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు). ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ప్రశంసించారు. రేణు దేశాయ్ గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించారంటేనే కథలో ఉన్న దమ్ము అర్థమవుతోందన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ.. అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి హిలేరియస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, ‘బ్యాడ్ గాళ్స్’ అలా ఉంటుందని వివరించారు. ఇదొక ఫ్రెష్ ఎంటర్టైనర్ అని, ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ సాహిత్యం, అనూప్ రూబెన్స్ సంగీతం సినిమా స్థాయిని పెంచాయని పేర్కొన్నారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


