యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంటూ, దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. బలమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సన్నీ లియోన్‌లోని సరికొత్త నటిని ఈ సినిమాలో చూస్తారని తెలిపారు. సెకండాఫ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హీరో యోగేష్ మాట్లాడుతూ, ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, CID ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ తొలిసారి తెలుగులో నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని పేర్కొన్నారు. ప్రవీణ్, జెమినీ సురేష్, సాహితీ దాసరి తదితరులు తమ పాత్రల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.


