సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని పి.ఓ.వి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు, సాయి కే వెన్నం నిర్మించారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మాదాపూర్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ సినిమాల్లో ‘కేజీఎఫ్’ ఎలాంటిదో.. లవ్ స్టోరీల్లో ‘నిలవే’ అలాంటి చిత్రం’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాయని సునీత మాట్లాడుతూ.. ‘‘ఇదొక అర్థవంతమైన సినిమా. ‘సఖి’, ‘ఏ మాయ చేశావే’ తరహాలో మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది. కీరవాణి గారు కూడా ఈ చిత్ర పాటలను విని మద్దతు తెలపడం సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను తీసుకొచ్చింది’’ అని చిత్రబృందాన్ని అభినందించారు.
దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన స్ఫూర్తితో, కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా తీశాం. కొత్తవారితో చేసినా అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చింది’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కథతో పాటు సాగే 11 పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చిందని నిర్మాత రాజ్ అల్లాడ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా ఇతర కీలక పాత్రలు పోషించారు.


