ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో తెరకెక్కిన ‘ధురంధర్-2’ మరియు ‘టాక్సిక్’ చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ బాక్సాఫీస్‌పై ఈ సినిమాలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ధురంధర్’ మొదటి భాగం అక్కడ నిషేధానికి గురవ్వడంతో రెండో భాగానికి లైన్ క్లియర్ కాలేదు. ఇక యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రానికి కూడా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు అడ్డంకిగా మారాయి.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి ప్రాంతాలను వార్ జోన్‌లోకి నెట్టాయి. అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచించాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఈ యుద్ధ వాతావరణం మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో, థియేటర్ల వద్ద సందడి ఉండే అవకాశం కనిపించడం లేదు.
సాధారణంగా భారతీయ సినిమాలకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచి వసూళ్లు వస్తుంటాయి. సౌదీ అరేబియా, ఖతార్ వంటి ప్రాంతాల్లో ఉన్న భారీ భారతీయ జనాభా కారణంగా అక్కడ ఓ మోస్తరు వసూళ్లు గ్యారెంటీగా ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘టాక్సిక్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఈ కీలకమైన మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇది బాక్సాఫీస్ ఓవరాల్ కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


