బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మూడో వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం భారతదేశంలో ఏకంగా రూ.1000 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం 18 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1622 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, భారతీయ సినిమా సత్తాను చాటింది. నార్త్ అమెరికాలో 25 మిలియన్ డాలర్లు, జర్మనీలో 1 మిలియన్ యూరోల మార్కును దాటిన తొలి ఇండియన్ ఫిల్మ్‌గా ఇది సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో గల్ఫ్ దేశాల సహాయం లేకుండానే దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ సాధించడం గమనార్హం.
మూడో వీకెండ్ లో కూడా శుక్ర, శని, ఆదివారాల్లో భారీ వసూళ్లను రాబడుతూ ఈ చిత్రం స్ట్రాంగ్ హోల్డ్‌ను ప్రదర్శించింది. ప్రస్తుతం ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.1228 కోట్లకు చేరుకుంది. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ వంటి సౌత్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ల సరసన చేరిన ‘ధురంధర్ 2’, అత్యంత వేగంగా రూ.1000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.


