కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన తండ్రి విజయ్ గురించి అలాగే తనకు ఇష్టమైన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో జేసన్ స్టాతమ్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే, తమిళ పరిశ్రమ నుంచి ఏ నటుడిని ఎంచుకుంటారని అడిగిన ప్రశ్నకు జేసన్ సంజయ్ బదులిచ్చారు. “ఖచ్చితంగా మా నాన్న విజయ్‌నే ఎంచుకుంటాను. వారిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది” అని చెప్పారు. అంతేకాకుండా, తన సమాధానంపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తాయేమోనంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ (Sigma) చిత్రంతో జేసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. స్టార్ హీరో కొడుకై ఉండి నటన వైపు వెళ్లకుండా దర్శకత్వాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.. చిన్నతనం నుంచే షూటింగ్ వాతావరణంలో పెరగడం తన ఆలోచనలపై ప్రభావం చూపిందని వివరించారు. మొదట్లో పైలట్ లేదా క్రికెటర్ కావాలనుకున్నప్పటికీ, పాఠశాల విద్య పూర్తయ్యే సమయానికి సినిమా నిర్మాణ రంగంపై ఆసక్తి పెరిగిందని, అందుకోసమే విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేశానని పేర్కొన్నారు.
నటన కంటే కథలు రాయడం, వాటిని తెరకెక్కించడమే తన అసలు ప్యాషన్ అని స్పష్టం చేసిన జేసన్ సంజయ్, ప్రస్తుతం పూర్తిస్థాయి దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.


