రితేష్ రానా దర్శకత్వంలో సత్య హీరోగా నటించిన ‘జెట్లీ’ మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంతో రియా సింఘా హీరోయిన్‌గా పరిచయమవుతుండగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత చెర్రీ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
డైరెక్టర్ రితేష్ గారు ఈ కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి?
ఈ సినిమా చాలా ప్రత్యేకం, కథలో 80 శాతం విమానంలోనే సాగుతుంది. తెలుగులో ఇలాంటి ప్రయోగం ఇప్పటివరకు రాలేదు. రితేష్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో వస్తాడు, తను నాకు అబ్బాయి లాంటివాడు. మా మధ్య ఉన్న మంచి అనుబంధం వల్ల తనతో పనిచేయడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.
జెట్లీ సినిమాను ముందుగా పెద్ద హీరోతో చేయాలనుకున్నారట?
మొదట దీన్ని సీరియస్ థ్రిల్లర్‌గా అనుకున్నా, రెగ్యులర్ హీరోలకు సెట్ కాకపోవడంతో రితేష్ కామెడీ థ్రిల్లర్‌గా మార్చాడు. గమ్మత్తైన సన్నివేశాలు పండాలంటే సత్య లాంటి టైమింగ్ ఉన్న నటుడే కరెక్ట్ అని తనని ఎంపిక చేశాం. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది, యాక్షన్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది.
రియా సింఘా గురించి?
రియా సింఘా చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంటుంది. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది.
కాల భైరవ మ్యూజిక్ గురించి?
రితేష్ తన మొదటి సినిమా నుంచి అదే టెక్నీషియన్స్‌తో పనిచేస్తున్నాడు. వాళ్లందరూ ఒకే వేవ్‌లెంగ్త్‌లో ఉంటారు. అందుకే అతనికి కావాల్సిన అవుట్‌పుట్ వస్తుంది. ఈ సినిమాకు కూడా అందరూ అద్భుతంగా పని చేశారు.
ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంది?
సినిమా చూశాక మాకు పూర్తి నమ్మకం కలిగింది; ఇది అద్భుతమైన కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. సత్య, వెన్నెల కిషోర్, అజయ్ వంటి నటుల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలం. కేవలం నవ్వులే కాకుండా, బలమైన కథ కూడా ఉండటంతో ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా ఉన్నాం.


