టాలీవుడ్లో ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరించే ప్రేక్షకులు ఉంటారు. క్యాచీ టైటిల్స్, వినూత్నమైన కథలతో వచ్చే సినిమాలకు మొదట్నుంచీ మంచి క్రేజ్ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే వస్తున్న తాజా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ.. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీకి శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో సందడిగా నిర్వహించారు.
మెడిసిన్ నుంచి సినిమాల్లోకి..
ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న పవన్ మహావీర్ బ్యాక్‌గ్రౌండ్ అందరినీ ఆకట్టుకుంటోంది. లండన్‌లో మెడిసిన్ చదువుతున్న పవన్, నటనపై ఉన్న ప్యాషన్‌తో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. టీజర్లో అతని యాక్టింగ్ చూసిన సినీ ప్రముఖులు.. పవన్‌లో మంచి ఈజ్ ఉందని, తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా స్క్రీన్‌పై కనిపించాడని మెచ్చుకున్నారు.
నిర్మాత శైలజ రెడ్డి కూడా తొలి సినిమాతోనే ప్రొడక్షన్ వ్యవహారాలపై మంచి పట్టు సాధించారని అతిథులు ప్రశంసించారు. ఆమెకు, హీరో పవన్‌కు ఇండస్ట్రీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సినీ పెద్దలు దీవించారు. ఈ వేడుకలో ఏపీఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, విఎన్ ఆదిత్య, వల్లభనేని అనిల్, కే అశోక్ కుమార్‌తో పాటు పలువురు సినీ జర్నలిస్టులు, ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సినిమాలో పవన్ సరసన వర్షిక, సుహానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు శివాల ప్రభాకర్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్‌కు వచ్చిన అతిథులకు, సినిమా బాగా రావడానికి కష్టపడిన సాంకేతిక నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ లవ్ స్టోరీ థియేటర్లలో సందడి చేయనుంది.


