నటుడు, వైద్యుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదాల రవి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను పలువురు స్మరించుకుంటున్నారు.
‘ఎర్రమల్లెలు’ చిత్రంతో బాలనటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన మాదాల రవి, ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్లారు. అక్కడ ఇంటర్నల్ మెడిసిన్లో MD, గ్యాస్ట్రోఎంటరాలజీలో DM పూర్తి చేశారు. రష్యాలోని భారతీయ సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిగా, ఓ ప్రముఖ ఫార్మా సంస్థకు ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ‘నేను సైతం’, ‘మా ఇలవేల్పు’, ‘బ్రోకర్ 2’ వంటి చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తూనే వాటిని నిర్మించారు.
సినిమారంగంతో పాటు సామాజిక సేవా రంగంలోనూ మాదాల రవి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేదలు, శ్రామిక కుటుంబాల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ‘పీపుల్స్ డాక్టర్’గా గుర్తింపు పొందారు. వామపక్ష నాయకుడిగా ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకోవడంతో పాటు, ప్రజా నాట్య మండలి ద్వారా సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం ‘మా’ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, సినీ కార్మికులు, అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం పలు ఆరోగ్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళారంగంలోనూ, వైద్య వృత్తిలోనూ తనదైన ముద్ర వేసిన మాదాల రవి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ పలువురు ఆయనకు బర్త్డే విషెస్ అందించారు.


