గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న తన బ్రేకప్ రూమర్స్ పై నటి అనుపమ పరమేశ్వరన్ ఎట్టకేలకు స్పందించింది. ఎవరి పేరునూ ప్రస్తావించకుండా, గడిచిన ఏడాది కాలం తన జీవితంలో ఎమోషనల్‌గా ఎంతో కష్టంగా గడిచిందని, ఒకానొక దశలో తనని తాను కోల్పోయినంత పని అయిందని ఆమె తెలిపింది. తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి ‘బైసన్ కాలమాడన్’ చిత్రంలో నటించినప్పటి నుండి వీరిద్దరి ప్రేమాయణం గురించి, ఆ తర్వాత సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడం, భావోద్వేగపూరిత పోస్టుల గురించి రూమర్లు ఊపందుకున్నాయి. అయితే, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ రూమర్లను ఆమె నేరుగా ధృవీకరించడం కానీ, ఖండించడం కానీ చేయలేదు.
గత ఏడాది ఎదురైన ప్రతికూల పరిస్థితులు తనకు తన స్వయం ప్రాధాన్యతను గుర్తుచేశాయని, ఇన్నాళ్లూ ఇతరుల కోసం బతికిన తాను ఇప్పుడు తన జీవితంపై పూర్తి నియంత్రణ తీసుకున్నానని అనుపమ పేర్కొంది. ప్రస్తుతం తాను ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని, గతాన్ని వదిలేసి ముందుకు సాగడంపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేసింది. అలాగే, తన వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ వివరించాల్సిన అవసరం లేదని, కొన్ని అనుభవాలు వ్యక్తిగతంగా ఉంటేనే మంచిదని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ కొత్త చర్చకు దారితీసినప్పటికీ, బ్రేకప్ రూమర్లపై ఆమె మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.


