ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని వారాల పాటు యూరోప్ లో తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన చిన్న విరామం తర్వాత, తాజాగా ‘రాకా’ చిత్ర షూటింగ్‌లో మళ్ళీ అడుగుపెట్టాడు. ఈ కొత్త షెడ్యూల్ ముంబైలో తాజాగా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ వర్క్ అంతా ఈ ఏడాదిలోనే పూర్తి కానున్నప్పటికీ, చిత్ర యూనిట్ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిసిన తర్వాత, వచ్చే వేసవి అనంతరమే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
’రాకా’ పూర్తి కాగానే, అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తక్కువ సమయంలో, ఫాస్ట్ షెడ్యూళ్లతో పాటు పరిమిత బడ్జెట్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2027లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒకవేళ లోకేష్ కనగరాజ్ సినిమా డిసెంబర్ 2027 నాటికి విడుదల కాకపోతే, ఈ చిత్రం సంక్రాంతి 2028 బరిలో నిలిచే అవకాశముంది. ఏది ఏమైనప్పటికీ, అంతా అనుకున్నట్లు జరిగితే 2027 లోనే ఐకాన్ స్టార్ నుంచి రెండు సినిమాలు థియేటర్లలోకి రావడం ఖాయమని చెప్పాలి.


