ఇంటర్వ్యూ : ప్రభాస్ – పెదనాన్న ముందు ఆ సీన్ చేయడానికి చాలా భయపడ్డాను

ఇంటర్వ్యూ : ప్రభాస్ – పెదనాన్న ముందు ఆ సీన్ చేయడానికి చాలా భయపడ్డాను

Published on Sep 30, 2012 7:02 PM IST

రాఘవ లారెన్స్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా గత శుక్ర వారం విడుదలై మొదటి రోజు రికార్డు కలెక్షన్లు వసూలు చేసి దూసుకుపోతున్న సందర్భంగా ఈ చిత్ర హీరో ప్రభాస్ తన ఆనందాన్ని విలేఖరులతో పంచుకున్నారు. ప్రభాస్ చెప్పిన ముచ్చట్లు మీకోసం.

ప్రశ్న) డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ క్లాస్ సినిమాల తరువాత రెబల్ సినిమా వంటి మాస్ సినిమా చేసారు రెస్పాన్స్ ఎలా ఉంది?

స) డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ముందు అన్ని మాస్ సినిమాలే ఎక్కువగా చేశాను. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రెండు సినిమాలు నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసాయి. ఫ్యామిలీ ఇమేజ్ నుండి బయటపడటానికి రెబల్ చేశాను. సినిమాకి రెస్పాన్స్ చాలా బావుంది. మొదటి రోజు నా గత సినిమాల కంటే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి.

ప్రశ్న) ఈ సినిమాకి రెబల్ అనే టైటిల్ పెట్టమని మీరే సలహా ఇచ్చారా?

స) మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేస్తున్న సమయంలో డార్లింగ్ నువ్వు మాస్ సినిమా చేస్తే రెబల్ అనే టైటిల్ బావుంటుందని ఆ చిత్ర దర్శకుడు దశరథ్ అన్నారు. ఆ తరువాత వి.వి వినాయక్ కూడా ఒక సమయంలో రెబల్ అనే టైటిల్ బావుంటుంది ట్రై చేయమన్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ కి మొదట రెబల్ పెడితే ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ అంత సాఫ్ట్ సినిమాకి ఇంత రఫ్ టైటిల్ సరికాదని పెట్టలేదు. రెబల్ షూటింగ్ ప్రారంభమైన తరువాత రెబల్ టైటిల్ ఎలా ఉంటుంది అన్నాను, అందరికీ నచ్చడంతో ఓకే చేసాం.

ప్రశ్న) ఈ సినిమాలో మీ ఫేవరేట్ సీన్స్ ఏమిటి?

స) రామోజీ ఫిలిం సిటీలో తీసిన ఇంటర్వెల్ ముందు ఫైట్ నాకు చాలా ఇష్టం. సినిమాలో మెయిన్ హైలెట్ ఈ ఫైట్ సీక్వెన్స్. ఆ తరువాత టెంపుల్ ముందు ఫైట్, అలీతో కామెడీ సీన్స్, పెదనాన్నకి సుప్రీత్ మధ్య వచ్చే సీన్, అల్యూమినియం ఫ్యాక్టరీలో విలన్స్ ని కొట్టి వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా నాకు బాగా నచ్చింది.

ప్రశ్న) రెబల్ చిత్రీకరణకి చాలా సమయం పట్టింది ఎందుకని?

స) లారెన్స్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని చాలా స్టైలిష్ గా తీద్దామని చెప్పారు. అలా ఫైట్స్ అన్ని తీయడానికి బాగా టైం పట్టింది. రామోజీ ఫిలిం సిటీలో తీసిన ఇంటర్వెల్ ముందు ఫైట్ తీయడానికే 12 రోజులు పట్టిందంటే అయన ఎంత కేర్ తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ప్రశ్న) రెబల్ ఆడియో రెస్పాన్స్ ఎలా ఉంది?
స) చాలా బావుంటుందని అనుకున్నాం, కానీ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఒక నెల ముందుగా ఆడియో విడుదల చేసి ఉంటే రెస్పాన్స్ ఇంకా బావుండేదేమో.

ప్రశ్న) బిల్లా సినిమా తరువాత మళ్లీ మీ పెదనాన్న గారితో కలిసి నటించారు ఎలా అనిపించింది?

స) ఆయనతో చేసిన సీన్స్ అన్ని బాగా నచ్చాయి. ముఖ్యంగా టెంపుల్ మందు ఫైట్లో వెనక్కి వెళ్ళిపో అనే సీన్ దగ్గర బాగా ఇబ్బంది పడ్డాను. పెదనాన్నని అలా అనడానికి దైర్యం సరిపోలేదు. అయన ముందు చేయనని చెప్పాను, పెదనాన్నే ధైర్యం చెప్పి చేయించారు.

ప్రశ్న) ఇంతకి ఈ సినిమాలో రెబల్ ఎవరు మీరా? మీ పెదనాన్నా?

స) (నవ్వుతూ) రెబల్ నేను కాదండీ పెదనాన్న గారే.

ప్రశ్న) వారధి సినిమా ఎప్పుడు వస్తుంది?

స) ఈ సినిమాకి ఇంకా వారధి అనే టైటిల్ ఖరారు కాలేదు. టైటిల్ ఏమిటి అనేది ఒక వారంలో ప్రకటిస్తాము. డిసెంబర్లో విడుదలవుతుంది.

ప్రశ్న) రాజమౌళితో సినిమా ఎలా ఉండబోతుంది? షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

స) పూర్తి మాస్ మసాలా సినిమా. డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.

 ఇంటర్వ్యూ :  అశోక్ రెడ్డి. ఎమ్

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు