ఇంటర్వ్యూ : మనో – ఇది హాయిగా నవ్వుకునే సినిమా !

Published on Aug 16, 2021 4:48 pm IST

 

సింగర్ మనో, శ్రీముఖి, భరణి, భరణి, రాజా రవీంద్ర ప్రధానా పాత్ర‌ల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ “క్రేజీ అంకుల్స్”. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మనో మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

 

క్రేజీ అంకుల్స్ ఎంత క్రేజీగా ఉండబోతుంది ?

మంచి కాన్సెప్ట్. సరదాగా ఉంటుంది. అందరికీ ఆనందం కలిగించే సినిమా, హాయిగా నవ్వుకునే సినిమా యాభై ఏళ్ళు దాటిన ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా.

 

ఈ సినిమాలో మీ పాత్ర ఏమిటి ?

నా పాత్ర చాలా కామెడీగా సాగుతుంది. సినిమాలో నేను బంగారు కొట్టు ఓనర్ గా నటిస్తున్నాను. మంచి క్యారెక్టర్, చాలా ఫన్నీగా ఉంటుంది.

 

షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. కరోనా నివారణ చర్యలకు సంబంధించిన అన్ని రకాలుగా కేర్ తీసుకుని ఈ సినిమా షూట్ చేశాము.

 

మీరు ప్రస్తుతం జబర్దస్త్ జడ్జ్ గా చేస్తున్నారు. అప్పుడప్పుడు స్టేజ్ పై కూడా నటుడిగా కనిపిస్తున్నారు. అంటే మీ నుండి పూర్తి వినోదం అక్కడ దొరుకుతుంది. మరి మీరు చేసిన కామెడీ సినిమా కోసం జనం థియేటర్ దగ్గరకు వస్తారా ?

థియేటర్ కి వస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాము. ప్రేక్షక దేవుళ్లు మా ప్రయత్నం ఆదరిస్తారని నమ్ముతున్నాను.

 

గతంతో పోల్చుకుంటే.. కామెడీ విషయంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు వచ్చాయి ?

పెద్దగా మార్పులు వచ్చాయని నేను అనుకోవడం లేదు అండి. మనలో సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మనకు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ముఖ్యం. కాబట్టి కామెడీ విషయంలో కూడా అన్నీ విలువులను దృష్టిలో పెట్టుకుని చేస్తేనే ఆదరిస్తారు. కాకపోతే ఇప్పుడు కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నారు.

 

అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి ?

హైదరబాద్‌లో ఉంటున్న రాజు.. రెడ్డి.. రావుల కథ ఇది. అనుకోకుండా ఈ ముగ్గురు ఉండే అపార్ట్‌మెంట్‌లోకి ఓ అందమైన అమ్మాయి అడుగుపెడుతుంది. ఆ అమ్మాయి పై ఆకర్షణ పడిన ఈ ముగ్గురు ఏమి చేశారు అనేది మెయిన్ కథ.

 

ఒక నటుడిగా మీ సినీ కెరీర్ గురించి ?

చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నేను నటించాను. దాసరిగారు నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ గా 1979లో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించాను. అయితే, ప్రతి సింగర్ లో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. అయితే, మంచి హాస్యభరితమైన పాత్రల్లో నటించాలని నాకు ఉంది.

 

మరి నటుడు నుండి సింగర్ గా ఎలా మారారు ?

చిన్నప్పటి నుండి నేను సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మగారు డ్రామా ఆర్టిస్ట్, మా నాన్నగారు హార్మోనిస్టు. ఇంట్లో చిన్నప్పటి నుండి సంగీతం ఉంది కాబట్టి, అలా పాడటం నాకు అలవాటు అయిన పని. అలా సింగర్ ను అయ్యాను. 25 వేల పాటలు పాడాను.

 

మిమ్మల్ని భవిష్యత్తులో కొత్త పాత్రల్లో చూడగలమా ?

కచ్చితంగా చేస్తాను. అవకాశాలు వస్తే చేయాలని ఆశ నాకు ఉంది. జగ్గయ్యగారిలా అలాగే కొత్త పాత్రలు చేయాలని ఉంది.

సంబంధిత సమాచారం :