ఇంటర్వ్యూ : డైరెక్టర్ సాయికిరణ్ దైదా – ఈ సినిమాకి “పిండం” అనే టైటిల్ అందుకే పెట్టాం

ఇంటర్వ్యూ : డైరెక్టర్ సాయికిరణ్ దైదా – ఈ సినిమాకి “పిండం” అనే టైటిల్ అందుకే పెట్టాం

Published on Dec 9, 2023 10:08 PM IST

సౌత్ ప్రముఖ హీరో శ్రీరామ్ అలాగే నటి ఖుషీ రవి జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రమే “పిండం”. ఇక ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సాయికిరణ్ దైదా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

 

ఈ సినిమాకి “పిండం” అనే టైటిల్ పెట్టడానికి కారణమేంటి?

“పిండం” అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. సినిమా చూశాక అందరూ అంటారు.. ఇదే ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్ అని. భవిష్యత్ లో కూడా నేను ఏ సినిమా చేసినా కథకి సరిపోయే టైటిలే పెడతాను.

 

ఈ సినిమాని నిజంగానే నిజజీవిత ఘటనల ఆధారంగానే తెరకెక్కించారా?

ఆ ఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పలేను. సినిమా చూశాక తెలుస్తుంది. ఆ ఘటన చుట్టూ అల్లుకున్న కల్పిత కాబట్టి, మెదక్ జిల్లాలోని శుక్లాపేట్ లో జరిగినట్లుగా సినిమాలో చూపించాం.

 

మీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పండి?

చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. కాలేజ్ సమయంలో బ్లాగ్స్ రాసేవాడిని. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ లు, అక్కడి నుంచి ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ లు రాయడం అలవాటు చేసుకున్నాను. యూఎస్ లో బిజినెస్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ లు రాయడం కొనసాగించాను. నాకు ఎప్పుడైతే పట్టు వచ్చింది అనిపించిందో అప్పుడు సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు.

 

శ్రీరామ్ గారిని తీసుకోవాలి అనే ఆలోచన ఎవరిది?

నాకు మూడు నాలుగు కాస్టింగ్ ఆప్షన్లు ఇచ్చారు. అందులో శ్రీరామ్ గారి పేరు చూడగానే ఎగ్జైట్ అయ్యాను. ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూసి ఉన్నాను. ఆయన ఎలా నటిస్తారో తెలుసు. ఈ పాత్రకి శ్రీరామ్ గారు నూటికి నూరుశాతం సరిపోతారు. ఆయనలో ఒక వింటేజ్ లుక్ ఉంటుంది. 1990ల కథకి ఆయన బాగా సెట్ అవుతారు.

 

ఇప్పటికే చాలా హారర్ చిత్రాలు వచ్చాయి, పిండం వాటికి మించి వైవిధ్యంగా ఉంటుందా?

ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి

కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు