ఇంటర్వ్యూ: సంపూర్ణేష్ బాబు- హీరో అయితే ఇన్ని అవమానాలు భరించాలా అని బాధేసింది.

ఇంటర్వ్యూ: సంపూర్ణేష్ బాబు- హీరో అయితే ఇన్ని అవమానాలు భరించాలా అని బాధేసింది.

Published on Aug 7, 2019 4:12 PM IST

సంపూర్ణేష్ బాబు నటించిన “కొబ్బరిమట్ట” మూవీ ఈనెల 10న విడుదల కానున్న నేపథ్యంలో హీరో సంపూ ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 

ఏకబిగిన మూడున్నర నిమిషాలు మూడున్నర నిముషాలు డైలాగ్ చెప్పారు, మీకు కష్టంగా అనిపించిందా?

హా అవును ఆ డైలాగ్ చెప్పడానికి చాలా ప్రాక్టీస్ చేశాను.డైరెక్టర్ నాకు డైలాగ్ పంపి ప్రిపేర్ కామన్నారు. ఏడు నిమిషాల డైలాగ్ ని మూడున్నర నిమిషాలలో పూర్తిచేయాలి. పదో తరగతి పిల్లాడు పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు మొత్తం డైలాగ్ బట్టీపట్టాను.

 

కొబ్బరి మట్ట చిత్రం విడుదల ఆలస్యం వెనుక కారణాలు చెవుతారా?

అవును ఈ చిత్రం ఎప్పుడో రావలసింది. హృదయకాలేయం సినిమా విడుదల సమయంలోనే ఈ చిత్ర పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది.ఈ చిత్రం ఆలస్యం కావడానికి అనేక కారణాలున్నాయి,మేము అనుకున్న బడ్జెట్ పరిమితి దాటిపోవడం, మూడు వైవిధ్యమైన పాత్రలు కావడంతో షూటింగ్ డేస్ కూడా పెరగడం జరిగింది. ఆరుగు భార్యలు,నలుగురు అన్నదమ్ములు,ముగ్గురు చెల్లెల్లు వంటి భారీ కాస్ట్ వలన, నేను బిగ్ బాస్ షో కి వెళ్లడం వలన, నటుల డేట్స్ కుదరకపోవడం వలన ఇలా అనేక కారణాల వలన మూవీ ఆలస్యం అయ్యింది.

 

కొబ్బరిమట్ట టైటిల్ పెట్టడానికి గల కారణం ఏమిటి?

ఇప్పటికే మావిడాకులు, గోరింటాకు అనే టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. ఏదైనా ఓ పెద్ద ఆకు పేరు పెడితే బాగుంటుందని “కొబ్బరిమట్ట” అని పెట్టాం(నవ్వుతూ ).

 

ఈ మూవీ ఇక విడుదల కాదని వార్తలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.?

చాలా బాధేసింది. ఎందుకంటే అప్పటివరకు నాతో ఉన్నవారే అలా నెగెటివ్ గా మాట్లాడుతుంటే బాధేసేది.

 

అసలు మీరు హీరో ఎలా అయ్యారు?

నాకు చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండేది. మావూరు మిట్టపల్లిలో నాటకాల కూడా ఆడేవాడిని. నేను సినిమాపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దర్శకుడు స్టీవ్ శంకర్ నన్నుచూసి,నేను ఓ వరస్ట్ హీరో కోసం చూస్తున్నాను. అది నువ్వే అన్నారు. అలా హీరో ఐపోయాను. (నవ్వుతూ)

 

హృదయకాలేయం తరువాత అనేక విమర్శలు వచ్చినట్లున్నాయి?

అవును అప్పట్లో వీడేంటి, హీరో ఏంటి అని చాలా మంది విమర్శించారు. కొందరైతే ఫోన్ చేసి మరి తిట్టేవారు. హీరో ఐతే ఇన్ని అవమానాలు భరించాలా అనిపించేది. రాజమౌళి గారు ఒక ట్వీట్ చేశాక కొంచెం తగ్గింది.

 

కొబ్బరి మట్ట ఆగిపోతుందని తెలిసినప్పుడు వేరే సినిమాలలో ఎందుకు నటించలేదు?

ఎక్కడో మిట్టపల్లి లాంటి చిన్న పల్లెటూరికి చెందిన నన్ను, హీరో చేసిన వ్యక్తి స్టీవ్ శంకర్. అలాంటి వ్యక్తి ఈ చిత్రం కోసం నిర్మాతగా కూడా మారాడు. ఆయనకోసమైనా ఈ చిత్రం విడుదలైయ్యేలా నా వంతు ప్రయత్నం చేశాను.

 

కరెంటు తీగ చిత్రంలో సన్నీ లియోన్ నటించారు కదా?

అవును, కానీ నాకు అప్పటికి సన్నీ లియోన్ ఎవరో తెలియదు. ఆమెతో ఏమైనా మాట్లాడదామంటే నాకు ఇంగ్లీష్ రాదు,ఆమెకు తెలుగు రాదు. (నవ్వుతూ)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు