15 ఏళ్ల క్రితమే ప్రభాస్‌ బాక్స్ఆఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా

Published on Sep 30, 2020 10:19 pm IST


ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్. ఆయనతో సినిమాలు చేయాలని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఏ హీరో మీద భారీ బడ్జెట్ పెట్టొచ్చు అనే ప్రశ్నకు వినిపించే ఏకైక పేరు ప్రభాసే. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ చాలానే కష్టపడ్డారు. పాన్ ఇండియా స్థాయికి వెళ్లడానికి ప్రభాస్‌కు ‘బాహుబలి’ చిత్రం ఎంతలా దోహదం చేసిందో ఆ ‘బాహుబలి’ స్థాయికి రావడానికి దోహదం చేసిన చిత్రం ‘ఛత్రపతి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం విడుదలై ఈరోజు సెప్టెంబర్ 30కి సరిగ్గా 15 ఏళ్లు. 2005లో వచ్చిన ఈ చిత్రంతోనే ప్రభాస్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు.

ఈ సినిమా చూసే ప్రభాస్‌కు మాస్ ఆడియన్స్ బాగా కనెక్టయ్యారు. హీరో అంటే ఇలా ఉండాలి అనుకున్నారు. విడుదల 15 సంవత్సరాలు గడిచినా ‘ఛత్రపతి’ వదిలిన ట్రెడ్ మార్క్స్ కొన్ని అలాగే మిగిలిపోయాయి. ఫైట్ అంటే ‘ఛత్రపతి’ ప్రీ ఇంటర్వెల్ బీచ్ ఫైట్ తరహాలో ఉంటుందా, ఎలివేషన్ సీన్స్ అంటే ‘ఛత్రపతి’లా ఉంటాయా, ఇంటర్వెల్ బ్లాక్ అంటే ‘ఛత్రపతి’ని మించిన ఇంటర్వెల్ సీనా అని అడిగేంతలా ప్రభావం చూపింది ఈ చిత్రం. 160 కేంద్రాల్లో 50 రోజులు పాటు దిగ్విజయంగా నడిచిన ఈ సినిమా ప్రభాస్‌ను మాస్ హీరోగా నిలబెట్టింది.

2005 తర్వాత ఎన్ని ఫ్లాపులు పడినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం ‘ఛత్రపతి’ ఫలితమే. కొన్ని సినిమాలు కొందరు హీరోలకు టైలర్ మేడ్ సినిమాల్లా ఉంటాయి. ‘ఛత్రపతి’ కూడ ప్రభాస్‌ కోసమే రాసిన సినిమాలా ఉంటుంది. చిత్రంలో రాజమౌళి ప్రభాస్‌ను ఎలివేట్ చేస్తూ రాసిన ‘వాడి బాడీ బాక్స్ఆఫీస్ రా’ అనే డైలాగ్ నిజమై ఇప్పుడు ప్రభాస్ బాక్స్ఆఫీస్ కింగ్ అయిపోయారు. ఈ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రియ శరన్ నటించడం జరిగింది. ప్రభాస్ సినీ జీవితంలో ‘బాహుబలి’కి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ‘ఛత్రపతి’కి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికీ అభిమానులు ప్రభాస్ నుండి ‘ఛత్రపతి’ లాంటి సినిమా ఇంకొకటి వస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు.

సంబంధిత సమాచారం :

More