పవ‌న్‌ను స్టార్ హీరోను చేసిన ‘ఖుషి’కి 20 ఏళ్ళు

Published on Apr 27, 2021 3:00 pm IST

ప్రతి హీరో కెరీర్లో ఒక సినిమా ఉంటుంది. అదే అతనికి సాధారణ హీరో నుండి స్టార్ హీరో స్థాయికి వెళ్లే మార్గానికి తలుపులు తెరిచి ఉంటుంది. ఆ సినిమా లేకపోతే ఆ హీరో కెరీర్ ను ఊహించడమే కష్టం. పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడ ‘ఖుషి’ అలాంటి సినిమానే. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే ఏప్రిల్ 27వ తేదీన ‘ఖుషి’ విడుదలైంది. మొదటోరోజే హిట్ టాక్ తెచ్చుకుని అన్ని ఏరియాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో పవన్ స్టార్ హీరో అయిపోయారు. అసలు తెలుగు ప్రేక్షకులకు ప్రేమ కథల్లో ఒక కొత్తదనాన్ని పరిచయం చేసిన సినిమా ‘ఖుషి’. కథ ఆసాంతం హీరో హీరోయిన్ల ఈగో మీదనే నడుస్తుంది.

ఆ ఈగోలోనే ప్రేమ, విరహం, సరసం, కోపాలు తాపాలు అన్నీ ఉంటాయి. ఎస్.జె. సూర్య చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమా ఆ స్థాయిలో పెద్ద హిట్ అవడానికి పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన కారణం. అందులో పవన్ మేనరిజం, స్టైల్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, ఐడియాలజీ ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ఏ మేరా జహా అంటూ ఒక తెలుగు సినిమాలో పూర్తి స్థాయి హిందీ పాటను పెట్టడం అదే తొలిసారి. పాట సూపర్ హిట్. అందులో పవన్ స్టైల్ ఇంకో లెవల్.

హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కుర్రకారుకి కొత్త అనుభూతిని ఇచ్చింది. భూమిక మొదటి సినిమాతోనే మాయ చేసేసింది. మణిశర్మ పాటలు రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి. పవన్ ఇప్పటివరకు ఎన్ని హిట్ సినిమాలు చేసి ఉన్నా ఇక మీదట ఎన్ని చేసినా అన్నింటి మధ్యలో ‘ఖుషి’ ఒక ప్రత్యేకతతో వెలుగుతూనే ఉంటుంది.

సంబంధిత సమాచారం :