
ఏ.ఆర్.రెహమాన్ కుమారుడు ఏ.ఆర్. అమీన్ ఓకే కన్మణి(ఓకే బంగారం) సినిమాలో ఓ పాట పాడాడు. ‘మౌలా వా సల్లీమ్’ అంటూ సాగే ఈ పాటను నిజానికి రెహమాన్ ఓకే బంగారం కోసం చేయలేదు. ఏ.ఆర్. అమీన్ కోసం రెహమాన్ స్వయంగా ఓ పాటను సమకూర్చాడు. ఆ పాటను కేవలం తన కుటుంబం, బంధువల కోసం మాత్రమే తయారు చేశాడట. అయితే ఈ పాటను విన్న మణిరత్నం తన సినిమా ఓకే బంగారం కోసం కావాలనగానే రెహమాన్ ఇచ్చేశాడట.
“మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడి సినిమాలో మా అబ్బాయి పాట ఉండడం సంతోషమే కదా! నేను కేవలం నా ఫ్యామిలీ కోసం చేసిన ఓ పాట ఇలా సినిమాలో వస్తుందనుకోలేదు. ఇప్పటికే ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. రోజూ ఈ పాట బాగుందంటూ ఎన్నో మెసేజీలు వచ్చిపడుతున్నాయి” అని తెలిపాడు రెహమాన్. ఇక భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో రేపు (ఏప్రిల్ 17న) ఓకే బంగారం విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించారు.

