ఆడవారి మీద ఆకతాయిల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, చట్టాలను కఠినతరం చేసినా ఎక్కడో ఒక చోట నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వేధింపులు సామాన్య మహిళలకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడ ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు, నటీమణులు తమ జీవితంలో జరిగిన ఇలాంటి చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టగా తాజాగా మలయాళ హీరోయిన్ అన్నా బెన్ సైతం తాజాగా తన మీద జరిగిన వేధింపులకు సొషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
అన్నా బెన్ తన కుటుంబంతో కలిసి కొచ్చిలోని ఒక మాల్ కు వెళ్లగా ఇద్దరు ఆకతాయిలు ఆమెను ఫాలో చేసి అసభ్యకరమైన రీతిలో తాకారని చెప్పుకొచ్చింది. ‘ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడ తెలీలేదు. ఒక్క నిముషం షాక్లో ఉండిపోయాను. నా సోదరి నా వద్దకు పలకరించేవరకు తేరుకోలేకపోయాను. ఆ ఇద్దరినీ అక్కడే ఆపి నిలదీద్దామని అనుకున్నా. కానీ ఆ టైంలో ఎలా రియాక్ట్ కావాలో కూడ అర్థం కాలేదు. చాలా ఇబ్బందిపడ్డాను. వాళ్ళు నన్ను అనుకోకుండా తాకలేదు. కావాలనే వెనక నుండి టచ్ చేశారు. అది నాకు స్పష్టంగా తెలుసు. ఆ షాక్ లోనే అక్కడి నుండి బిల్ కౌంటర్ వద్దకు వెళ్ళాం. అయినా ఆ ఇద్దరూ మమ్మల్ని ఫాలో చేశారు. నాతో మాటలు కలిపేందుకు ట్రై చేశారు.
అప్పుడు ఇక కుదరదని ధైర్యం చేసి మీ పని మీరు చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్ఛాను. వాళ్ళను గమనించి మా అమ్మ నా వద్దకు రావడం చూసి వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్లకు తగిన బుద్ది చెప్పాలని చాలా అనుకున్నాను. కానీ ఆ భాదలో చేయలేకపోయాను. అందుకే నా బాధను ఇక్కడ చెప్పుకుంటే కొంచెమైనా తీరుతుందని ఇదంతా చెబుతున్నాను’ అంటూ తల్లడిల్లిపోతూ ఆవేదనను బయటపెట్టింది అన్నా బెన్.


