ఇంటర్వ్యూ : సమంత – చైతు హ్యాపీనెస్ కి మించి నాకు ఏది ఎక్కువ కాదు !

Published on Sep 11, 2018 3:13 pm IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో నటించగా, ఇతర కీలక పాత్రల్లో భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లతోనే ఈ చిత్రం మంచి బజ్ సృష్టించుకుంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా సమంత అక్కినేని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

‘యూ టర్న్’ చిత్రాన్ని మేం రీమేక్ చేద్దామనుకున్న తరువాత, మేము స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశాము.

ఈ సినిమాలో యాక్ట్ చేయాలని నేను నిర్ణయించుకున్న తర్వాత ‘ఓరిజినల్ మూవీ’ చూశాను. నాకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, వాళ్ళకి అవసరం నాకనిపించింది. అయితే మా యూ టర్న్ డైరెక్టర్ పవన్ గారితో పని చెయ్యాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది. అయితే ఈ చిత్రాన్ని మేం రీమేక్ చేద్దామనుకుని నిర్ణయించుకున్న తరువాత, మేము స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశాము. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పవన్ గారు స్క్రిప్ట్ ను తయారుచేశారు. లాస్ట్ 20 నిముషాలు మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

చైతు సినిమాతో పాటు, మా సినిమా కూడా రిలీజ్ చెయ్యాలని మేమెప్పుడూ ప్లాన్ చెయ్యలేదు.

చైతు మూవీ మరియు నా మూవీ ఒకే తేదీలో విడుదల అవుతుంటే.. లోపల చిన్న ఒత్తిడి అయితే ఉంది. అసలు చైతు సినిమాతో పాటు, మా సినిమా కూడా రిలీజ్ చెయ్యాలని మేమెప్పుడూ ప్లాన్ చెయ్యలేదు. కానీ యూ టర్న్ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదలవుతున్న కారణంగా, మేం విడుదల తేదీని మార్చడం కుదరలేదు. మా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా అయితే, చైతు హ్యాపీనెస్ కి మించి నాకు ఏది ఎక్కువ కాదు.

హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా నటించడం చాలా మంచి పరిణామం

ఈ మధ్య హీరోయిన్స్ ఓరియంటెడ్ మూవీస్ టాలీవుడ్ లో కూడా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత సంవత్సరంలో కూడా నేను నాలుగు విజయాలను ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. అయినా పెళ్లి తర్వాత కూడా నటిస్తున్నందుకు అందరూ నన్ను అభినందిస్తున్నారు. నాలా చాలామంది ఉన్నారు. సోనమ్ కపూర్, అనుష్కా శర్మ, జ్యోతిక లాంటి వారు పెళ్లి తర్వాత కూడా సంతోషంగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు. పరిశ్రమలో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి.

చైతు మద్దతు అనూహ్యమైనది

ఏ మహిళ అయినా ఆమె వృత్తిలో విజయవంతం కావాలంటే, ఆమె భర్త మద్దతు తప్పనిసరి. ఈ విషయంలో చైతు నాకు అందించిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనిది. కెరీర్ లో నేను ఏం చేసినా తను నన్ను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తాడు. తనతో పాటు టోటల్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్యామిలీ మొత్తం నాకు మద్దతు నిలుస్తుందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది.

మా కధానాయికల మధ్య ఎలాంటి పోటీ ఉండదు.

సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ ఫీల్డ్. మా హీరోయిన్స్ విషయానికి వస్తే.. పోటీ ఉంటుందని అందరూ అనుకుంటారు. నిజానికి మా మధ్య ఎలాంటి పోటీ ఉండదు. ఒక హీరోయిన్ స్థాయి పెరుగుతుంటే.. ఆమె పక్కనున్న హీరోయిన్స్ కూడా పెరుగుతారు, వారు కూడా మంచి అవకాశాలు పొందుతారని నేను భావిస్తున్నాను.

భవిష్యత్తులో నేను సినిమాలు నిర్మిస్తాను

ఇప్పటికి నేను సినిమా పరిశ్రమకి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. పరిశ్రమలో ఏది మంచి, ఏది చెడు అని నేను తెలుసుకున్నాను. ఈ అనుభవంతో మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్ తో భవిష్యత్తులో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిచాలనుకుంటున్నాను.

బాలీవుడ్ లోకి ప్రవేశించాలానే ఆలోచనలు గాని, ప్రణాళికలు గాని ఏమి లేవు.

చాలామంది నన్ను హిందీ పరిశ్రమలోకి వెళ్తున్నారా అని అడుగుతున్నారు. నేను బాలీవుడ్ లోకే కాదు, ఎక్కడికి వెళ్ళాను. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ చిత్రాలతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఇక్కడ చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఒక విధంగా చూస్తే.. ప్రయోగానికి నాకిది తగిన సమయం అని అనుకుంటున్నాను. రానున్న రోజులలో నా నుండి మరిన్ని ఉత్తేజకరమైన వైవిధ్యమైన చిత్రాలు రానున్నాయి.

త్వరలోనే నేను నటించబోయే కొత్త సినిమాలను ప్రకటిస్తాను.

ప్రస్తుతం నేను చైతుతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం కాకుండా త్వరలోనే మరో పెద్ద ప్రాజెక్ట్ ను ప్రకటిస్తాను.

సంబంధిత సమాచారం :