
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. ఈ మూడు సినిమాలు చాలు నిఖిల్ తన కథల విషయంలో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దూసుకెళుతున్నాడో చెప్పడానికి. మూడు వరుస విజయాల తర్వాత ఈ కోవలో తన నాలుగో సినిమానూ చాలా కొత్తగా ప్లాన్ చేసుకున్నాడు నిఖిల్. కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ‘శంకరాభరణం’ అన్న టైటిల్ పెట్టి బీహార్ నేపథ్యంలో క్రైం కామెడీ సినిమా తెరకెక్కిస్తున్నారన్న వార్త రాగానే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది.
ఇలా సరికొత్త కథలతో దూసుకెళుతోన్న నిఖిల్ తాజాగా మరో కొత్త సినిమాను కూడా లైన్లో పెట్టాడు. నిఖిల్ గత మూడు చిత్రాల్లోనూ భాగమైన చందూ మొండేటీ ఈ కొత్త సినిమాకు రచనా సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా సరికొత్త కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. చందూ ‘స్వామిరారా’, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలకు రచనలో సహకారాన్ని అందించగా కార్తికేయ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సాయితేజ ప్రొడక్షన్స్ పతాకంపై సి.హెచ్.వి. శర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.

