అక్కినేని వంశం నుండి సినిమా రంగంలో ఎంట్రీ ఇస్తున్న మూడవ తరం వారసుడు అఖిల్ అక్కినేని. గత కొన్ని రోజులుగా మీడియాలో అఖిల్ డెబ్యూ మూవీ గురించి చర్చ జరుగుతుంది. ‘మనం’లో అతిధి పాత్రలో తళుక్కున మెరిసిన అఖిల్, ప్రేక్షకులలో స్ట్రాంగ్ ఇంప్రెషన్ కలిగించాడు. దాంతో తొలి సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు అఖిల్ బాగా కష్టపడుతున్నాడు.
ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న అఖిల్, డాన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. స్టార్ హీరో అవ్వాలంటే మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకోక తప్పదు. ప్రజెంట్ యంగ్ హీరోలు డాన్స్ లో ఇరగదీస్తున్నారు. వారికి ధీటుగా అఖిల్ తన ఎంట్రీ ఉండాలని భావిస్తున్నాడు.
వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఓపెనింగ్ నవంబర్ 15న జరుగుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. వెలిగొండ శ్రీనివాస్ కథను అందిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ ద్వయం స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది. ఈ సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


