
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్ మొదటి సినిమా, ఈ దసరా సీజన్‌కు వస్తుందని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హీరో నితిన్ నిర్మించారు. దసరాకు ఈ సినిమా వచ్చి తీరుతుందన్న ఆనందంలో ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడడంతో అఖిల్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరిగిన జాప్యం కారణంగా ఈ సినిమా దసరా రేసులో నిలవలేకపోయింది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాగార్జున, దర్శకుడు వీవీ వినాయక్, హీరో అఖిల్, నిర్మాత నితిన్ ఇలా అందరూ సినిమా దసరాకు ఎందుకు రిలీజ్ కావట్లేదనే విషయమై స్పష్టతనిచ్చినా కూడా ‘అఖిల్’పై సినిమాపై పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. అఖిల్ సినిమాలో చాలా భాగాన్ని రీ షూట్ చేస్తున్నారని, సినిమా ఇప్పట్లో విడుదలయ్యే సూచనల్లేవని.. ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో అఖిల్ వీటన్నింటిని కొట్టిపడేస్తూ సమాధానమిచ్చారు.
అఖిల్ సినిమా విషయమై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయని, రీ షూట్ జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నానంటూ అఖిల్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఇప్పటికే వైభవంగా జరిగ్గా ఆడియోకు మంచి రెస్పాన్సే వస్తోంది. ప్రస్తుతం సినిమా నవంబర్ నెలాఖర్లో లేదా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.