అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్ మొదటి సినిమా, ఈ దసరా సీజన్‌కు వస్తుందని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హీరో నితిన్ నిర్మించారు. దసరాకు ఈ సినిమా వచ్చి తీరుతుందన్న ఆనందంలో ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడడంతో అఖిల్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
ఇక అకస్మాత్తుగా సినిమా దసరా సీజన్ నుంచి తప్పుకోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున స్వయంగా అభిమానులకు క్షమాపణలు తెలిపి, వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇక తాజాగా అఖిల్ కూడా ఇదే విషయాన్ని మరోసారి తెలియజేస్తూ.. పర్ఫెక్ట్ ఔట్పుట్ కోసం సినిమా టీమ్ కష్టపడుతోందని, ప్రస్తుతం పనులన్నీ చివరిదశకు చేరాయని తెలిపారు. ఇక ఇంతకాలం సినిమా కోసం ఓపిక ఎదురుచూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్స్ అందిస్తామని అఖిల్ స్పష్టం చేశారు.

