విశాల్ ‘జయసూర్య’ రిలీజ్‌కు లైన్ క్లియర్..!

jayasurya
తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్ తాజాగా ‘పాయుమ్ పులి’ అనే సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ‘జయసూర్య’ పేరుతో తెలుగులో ఎస్. నరసింహ ప్రసాద్, దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా, రేపు (సెప్టెంబర్ 4) తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమైంది.

కాగా ఈ సినిమా విడుదల విషయంలో గత మూడు, నాలుగు రోజులుగా అయోమయం నెలకొంది. తెలుగు వర్షన్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకున్నా, తమిళంలో మాత్రం ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్స్‌కి మధ్య తలెత్తిన వివాదాల వల్ల తమిళ సినీ నిర్మాతల మండలి ఈ వారం ఏ తమిళ సినిమా విడుదల కావట్లేదని ప్రకటించింది. అయితే హీరో విశాల్, పాయుమ్ పులి నిర్మాత ఈ విషయమై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో పలు చర్చలు జరిపి సినిమా బంద్‌ నిర్ణయాన్ని విరమించుకునేలా చేశారు.

ఇక ఇదే విషయంపై విశాల్ మాట్లాడుతూ.. “ఈ సినిమా విడుదల విషయంలో తలెత్తిన ఇబ్బందులన్నీ తొలగిపోయాయ్. తెలుగు, తమిళ భాషల్లో అనుకున్నట్లుగానే సినిమా విడుదలవుతోంది. సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యేలా సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో విశాల్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించారు.

Exit mobile version