సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్ళినా మెగా అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఒకింత కూడా తగ్గలేదు. ఆయన రాజకీయ ప్రవేశం చేసిన రోజు నుంచి మెగా అభిమానులు చిరంజీవి 150వ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను నెరవేర్చాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తనే నిర్మాతగా చిరంజీవితో 150వ సినిమా చేయాలని గత సంవత్సర కాలంగా పలు కథలను వింటున్నాడు. ఫైనల్ గా మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ నుంచి ఓ శుభవార్త వచ్చింది.
కొద్ది సేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్టర్ అని అధికారికంగా అనౌన్స్ చేసారు. అలాగే చిరు 150వ సినిమాకి స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేసారని తెలియజేశారు. ఈ సినిమాని చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ప్రారంభించి సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసారు. 2016లో సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. చిరంజీవి కూడా తన కంబ్యాక్ ఫిల్మ్ మైలురాయిగా నిలిచిపోవాలని ట్రై చేస్తున్నారు. అలాగే మెగా అభిమానుల అంచనాలను అందుకొని వాళ్ళని థ్రిల్ చేసేలా ఉండాలని కూడా ప్లాన్ చేస్తున్నారు.


