గోన గన్నారెడ్డి డైలాగ్స్‌కి బంపర్ రెస్పాన్స్!

గోన గన్నారెడ్డి డైలాగ్స్‌కి బంపర్ రెస్పాన్స్!

Published on Oct 9, 2015 5:00 PM IST

Allu-Arjun-As-Gona-Ganna-Re
‘రుద్రమదేవి’.. సగటు తెలుగు సినీ అభిమానిని ఎంతో కాలంగా ఎదురుచూయించిన ఈ సినిమా నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శకుడు గుణశేఖర్ కొన్నేళ్ళుగా కన్న కల నేడు తెరపై ఆవిష్కృతమైంది. ఇక ఇప్పటికే అన్నిచోట్లా విడుదలై, తెలుగు జాతి చరిత్రను పరిచయం చేసిన చారిత్రక సినిమాగా రుద్రమదేవి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన అనుష్క, గోన గన్నారెడ్డి అనబడే ఓ కీలక పాత్రలో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచారు.

ఇక అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. అందులోనూ అల్లు అర్జున్ పలికిన డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ‘గమ్మునుండవాయ్..’ అంటూ అల్లు అర్జున్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అల్లు అర్జున్ అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీతో గోన గన్నారెడ్డి పాత్ర అంతటా సంచలనంగా మారిపోయింది. ఇక గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగ్స్‌ రాసిన రాజసింహకు సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక చారిత్రక సినిమా నేపథ్యం మూడ్‌ను క్యాప్చర్ చేస్తూనే రాజసింహ, గోన గన్నారెడ్డికి అందించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ డైలాగ్స్‌కు ప్రేక్షకుల దగ్గర్నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రచయిత రాజసింహ ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కనున్న ఒక్క అమ్మాయి తప్ప సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు.

తాజా వార్తలు