దర్శకుడు మణిరత్నం ఎంతో శ్రద్ధగా తెరకెక్కించిన అందమైన ప్రేమకథ ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం). గత కొంతకాలంగా తన మార్క్ సినిమాని తీయలేకపోయిన మణిరత్నం ఈ సారి మాత్రం అభిమానులను నిరాశపరచడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అంటున్నారు. ఈ సినిమాను ‘ఓకే బంగారం’ పేరుతో తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.
ఈ నెల 17న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మణిరత్నం పాలు పంచుకున్నారు. సినిమా గురించి మాట్లాడుతూ.. “సామాజిక నియమాలను నా సినిమాల ద్వారానో, నేరుగానో చెప్పడానికి నేనేమీ హెడ్‌మాస్టర్‌ను కాదు. ఎవరికి వారు సమాజంతో పాటే నేర్చుకునే అంశాలవి. ఇక్కడ ఎవరికి వారే జడ్జి” అన్నారు. ఓకే బంగారం సినిమా సహ జీవనం నేపథ్యంలో నడిచే ఓ సరికొత్త ప్రేమకథగా చెప్పబడుతుంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.


