యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నందమూరి హరికృష్ణగారి హఠాన్మరణంతో ఈ సినిమా షూటింగ్ మూడు రోజులు పాటు వాయిదా పడింది. తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రం విడుదలవ్వనుంది. అలాగే వచ్చే వారం నుంచి ఈ చిత్రం నుండి ఇక రెగ్యులర్ అప్ డేట్స్ కూడా వస్తాయనితెలిపింది.
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలను అరవింద అందుకోగలడో లేడో చూడాలి.


