సమీక్ష : అశ్వమేథం – ఆకట్టుకోని క్రైమ్ డ్రామా

Published on Dec 6, 2019 11:35 pm IST
Ashwamedham review

విడుదల తేదీ : డిసెంబర్  06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ధ్రువ్ కరుణాకరణ్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, సుమన్, సోనియా, శివాంగి, అంబటి అర్జున్, ప్రచి తదితరులు

దర్శకత్వం : నితిన్ జి

నిర్మాత‌లు : ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్, రూపేష్, హెచ్ గుగాలే, శుబ్ మల్హోత్ర

సంగీతం :  చరణ్ అర్జున్

సినిమాటోగ్రఫర్ : ఎన్ జైపాల్ రెడ్డి

ఎడిటర్:  తమ్మి రాజు

నూతన నటుడు ధృవ్ కరుణాకర్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం అశ్వమేథం. దర్శకుడు నితిన్ జి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. నేడు ఈ చిత్రం విడుదలైంది. అశ్వమేథం చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం…

 

కథ:

 

భారత దేశ ఆర్థిక వ్యవస్థను కూల్చడానికి కొందరు దేశ ద్రోహులు ప్రొఫెషనల్ హ్యాకర్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తుంటారు. దీని వెనకున్న నేరస్థులను పట్టుకోవడానికి ధృవ్ ( ధృవ్ కరుణాకరణ్) అండర్ కవర్ ఐ బి ఏజెంట్ గా రంగంలోకి దిగుతాడు. ఆ నేరస్థులను పట్టుకొనే క్రమంలో ఐ బి ఆఫీసర్ శంకర్ కైలాష్( సుమన్) ధృవ్ కి సహాయపడుతూ ఉంటారు. అసలు ఈ దేశ ద్రోహులు ఎవరు? వారు మన ఆర్థిక వ్యవస్థలను ఎందుకు కూల్చాలని అనుకుంటున్నారు? మరి ధృవ్ వారిని ఎలా పట్టుకున్నాడు? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

నూతన హీరో ఐనప్పటికీ ధృవ్ ఐ బి అండర్ కవర్ ఏజెంట్ గా బాగా చేశారు. ఈ పాత్ర కోసం ఆయన తన ఫిజిక్ నుండి డాన్స్ లు మరియు ఫైట్స్ విషయంలో చాలా శిక్షణ తీసుకున్నారు అనిపిస్తుంది. అతని టోన్డ్ సిక్స్ ప్యాక్ బాడీ ఈ పాత్ర కు చక్కగా సరిపోయింది.

అలాగే అండర్ కవర్ ఏజెంట్ గా ధృవ్, ఐ బి ఆఫీసర్ గా సుమన్ మధ్య వచ్చే సన్నివేశాలు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ గా చేసిన సోన్యా మరియు శివాంగి లకు నటనకు అంత స్కోప్ లేకున్నప్పటికీ తమ పాత్ర పరిధిలో పర్వాలేదు అనిపించారు.

ఈ మధ్య స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న ప్రియదర్శి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకోగా అతని నటన బాగుంది, మరో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ డిజిటల్ ఇండియా మరియు మోడీపై అభిమానం కలిగిన టెక్కీగా మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్:

 

దేశభద్రతకు ముప్పు కలిగించడానికి దేశద్రోహులు ఎంచుకుంటున్న మార్గాలను ముఖ్యంగా సైబర్ దాడుల గురించి చక్కగా చెప్పినప్పటికీ, ఇలాంటి కాంప్లెక్సిటీ మరియు స్ట్రాంగ్ పాయింట్ ని డీల్ చేసేటప్పుడు ఇంతకు ముందు ఎవరు చెప్పని విధంగా కొత్తగా నెరేట్ చేయాలి. కానీ అశ్వమేథం సినిమాలో అటువంటి నవ్యత ఏమి కనిపించదు.

మొదటి సగం చూసిన ప్రేక్షకుడికి అశ్వమేథం సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. రాబోయే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా సాగుతాయి, ఏదో కొత్తగా చూడబోతున్నాం అనిపిస్తుంది. తీరా దర్శకుడు సెకండ్ హాఫ్ ని సాదా సీదా సన్నివేశాలతో తేల్చిపారేశారు.

ఒక సీరియస్ పాయింట్ తో నడిచే ఈ కథలో దర్శకుడు సాధారణ ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ అంశాలైన కామెడీ, రొమాన్స్ లేకపోవడం రుచించదు. అలాగే ఇలాంటి కథలను తక్కువ బడ్జెట్ సినిమాలతో డీల్ చేయడం సులభం కాదు.

 

సాంకేతిక విభాగం:

 

దేశ ఆర్ధిక వ్యవస్థకు కొందరు సైబర్ నేరగాళ్ల సాయంతో ఎలా కీడు చేయాలని చూస్తున్నారనే సోషల్ మరియు సమకాలిక విషయాలకు సంబంధించిన పాయింట్ తీసుకున్నప్పటికీ దానిని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు నితిన్ జి విఫలం చెందారు. క్రైమ్ థ్రిల్లర్స్ తెరపై పండాలంటే పట్టుసడలని స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అవసరం. కానీ అశ్వమేథం సినిమాలో స్క్రీన్ ప్లే బలహీనంగా సాగింది.

తక్కువ బడ్జెట్ సినిమా పరిధిలో నిర్మాణ విలువలు పరవాలేదు. చరణ్ అర్జున్ సాంగ్స్ బాగున్నాయి. కానీ బీజీఎమ్ అంతగా ఆకట్టుకోదు. గణేష్ స్వామి కొరియోగ్రఫీ, తమ్మి రాజు ఎడిటింగ్ బాగున్నాయి.

ఇక జయ్ పాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకొనే విజువల్స్ తో మెప్పించింది.

 

తీర్పు:

 

దేశ ఆర్థిక భద్రతకు సైబర్ దాడుల వలన ఎలాంటి ముప్పు పొంచి వుంది అనే ఓ నూతన పాయింట్ తో కూడిన సోషల్ ఇష్యూ ని కథా వస్తువుగా తీసుకున్నప్పటికీ దానిని తెరపై ఆసక్తికంగా మలచలేకపోయారు. ధృవ్ కరుణాకరన్ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ ని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు అని పిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలకు ఆధారమైన పట్టుసడలని స్క్రీన్ ప్లే ఈ మూవీలో లేకపోవడం సినిమాను పేలవంగా మార్చింది. తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో వారు తీసుకున్న కథకు న్యాయం చేయలేకపోయారు.

 

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here English Vesrion

సంబంధిత సమాచారం :