
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం మొదట్నుంచీ సెన్సేషన్‌గా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే వినూత్నంగా భారీ ఎత్తున నిర్వహించిన తెలుగు ఆడియో రిలీజ్ వేడుక బంపర్ హిట్ కాగా; తాజాగా నేటి సాయంత్రం కొచ్చిలో మళయాల ఆడియో ఆవిష్కరణ జరగనుంది. ఈ ఆడియో వేడుకకు ఓ ప్రత్యేకత కూడా ఉండడం విశేషం.
బాహుబలి మళయాల ఆడియో రిలీజ్ వేడుకలో ఓ సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పేందుకు బాహుబలి టీమ్ సిద్ధమైంది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా ఆవిష్కరించనంత సైజులో అతిపెద్ద పోస్టర్‌ను ఆవిష్కరించి వరల్డ్ రికార్డు నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు బాహుబలి యూనిట్ ఇప్పటికే కొచ్చిలో పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో ముచ్చటిస్తూ మళయాలం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇక జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో బాహుబలి భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!