మెగా మాతృమూర్తికి తొలి ‘బాపు బొమ్మ’ పురస్కారం.. దివ్యవాణి ఆధ్వర్యంలో ఘన సత్కారం

మెగా మాతృమూర్తికి తొలి ‘బాపు బొమ్మ’ పురస్కారం.. దివ్యవాణి ఆధ్వర్యంలో ఘన సత్కారం

Published on Mar 11, 2026 6:00 AM IST

Bapu Bomma

ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి గానూ వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. తొలి పురస్కారాన్ని మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవికి ప్రదానం చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో దసపల్లా హోటల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంజనీదేవితో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, అమెరికాకు చెందిన జనేతా కంచర్ల, డి. జ్యోతిరెడ్డి, డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి తదితర ప్రముఖ మహిళామణులు ఈ అవార్డులను అందుకున్నారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్, నటుడు, రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా విచ్చేసి అవార్డు గ్రహీతలను అభినందించారు. దివ్యవాణి ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును ముందుగా మెగా మాతృమూర్తికి అందించడం పట్ల వక్తలు హర్షం వ్యక్తం చేశారు.

సమాజంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళలను గౌరవించుకోవాలనే సంకల్పంతోనే ఈ అవార్డులను నెలకొల్పినట్లు దివ్యవాణి తెలిపారు. ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఈ అవార్డుల వేడుకను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా, దేశ విదేశాల్లోనూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు