‘బిగ్ బాస్’ షో ‘జై లవ కుశ ‘కు ఎంతవరకు కలిసొస్తుందో ?

19th, September 2017 - 03:53:37 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ షో ద్వారా ప్రతి తెలుగింటికీ చేరువైపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో గురించి తెలియని, షోను వీక్షించని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరేమో. దీని ద్వారా ఎన్టీఆర్ పాపులారిటీ బాగా పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సులో తారక్ పట్ల ఇంప్రెషన్ ఎక్కువైంది. ఇన్నాళ్లు ఆయన్ను ఒక హీరోగా మాత్రమే చూసిన మహిళా ప్రేక్షకులు ఇప్పుడు ఇంకాస్త దగ్గరివాడనే భావనతో చూస్తున్నారు. ఈ పెరిగిన ఆదరణే గురువారం విడుదలకానున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ పై ప్రభావం చూపనుంది.

ఇప్పటికే మంచి పాజిటివ్ క్రేజ్ ఉన్న ఈ చిత్ర్రం యువ, మాస్ ఆడియన్స్ నుండి ఎలాగూ ఆదరణ పొంది భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. ఇక లాంగ్ రన్ ఉండాలన్నా, సినిమా సూపర్ హిట్ కావాలన్నా అవసరమైన మహిళా, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ బిగ్ బాస్ షో ద్వారా అందనుంది. షో చూసిన ప్రతి ఒక్కరికీ ఈ గురువారం సినిమా విడుదలని తెలుసు. కాబట్టి ఓపిగ్గా రోజంతా ఎదురు చూసి మరీ సాయంత్రం షోను తిలకించిన వాళ్ళు దసరా సెలవుల్లో కుటుంబంతో కలిసి థియేటర్లకు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు. అదే సినిమాకు హిట్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్సే రిపీటెడ్ ఆడియన్సుగా మారొచ్చు.

కాబట్టి ఎన్టీఆర్ అటు సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉంటూనే అతి కష్టం మీద డేట్స్ కేటాయించి ఎంతో ఉత్సాహంతో చేసిన బిగ్ బాస్ షో ఆయనకు ప్రతిఫలాన్ని ఇవ్వడం ఖాయం. ఇక ఆ ప్రతిఫలం చిన్నగా ఉంటుందా లేక పెద్దగా ఉంటుందా అనేది సినిమా ఔట్ ఫుట్ మీద ఆధారపడి ఉంటుంది.